Aug 14,2023 20:49

- గాలి నాగరాజు, అలిరెడ్డిపల్లె అలిరెడ్డిపల్లెలో ఎర్ర తెగులుతో దెబ్బతిన్న వరి

వేంపల్లె : ఆరుగాలం కష్టించి, పెట్టుబడి పెట్టి పైరు సాగు చేస్తే ఆ పైరుకు తెగులు ఆశించడంతో రైతులు దిగాలుపడుతున్నారు. పంట చేతికొచ్చి అప్పులే తీరుతాయనే ఆశతో రైతులు వరి పంటను సాగు చేశారు. ఎర్రతెగులుతో వరి పంట ఎర్రగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆశలు ఆడియాశలయ్యాయని ఆందోళన చెందుతున్నారు. వరి పంట సాగు చేసి ఒక్కటిన్నర నెల అయిందని, ఎర్ర తెగులు ఆశించడంతో పంట ఎర్రగా మారి ఎండిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది బియ్యానికి మంచి రేటు ఉండడంతో ఆదాయం వస్తుందని రైతులు ఆశించారు. మధ్యలోనే తెగులు సోకడంతో పూర్తిగా పంట దెబ్బతిందని రైతులు అంటున్నారు. మండలంలో పాపాఘ్ని నది తీరప్రాంతాలైన అలిరెడ్డిపల్లె, తూపల్లె, ఇడుపులపాయ, వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె గ్రామ ప్రాంతాల్లో వరి పంటను దాదాపు 700 ఎకరాల్లో సాగు చేశారు. కొద్ది రోజుల్లో వరి పంట చేతికి వస్తాది అనే లోపు పలు రకాల తెగుళ్లు ఆశించాయి. రైతులు పంట చేతికి రాకుండా పోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. డబ్బు వృథానే తప్ప పంటను ఆశించిన తెగుళ్లు మాత్రం పోలేదని రైతులు చెబుతున్నారు. అలిరెడ్డిపల్లె, తూపల్లె గ్రామ పరిధిలో దాదాపు 200 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఎక్కువగా గ్రామాల్లో వరి పంటనే ప్రధానమైన పంటగా తీసుకొని సాగు చేయడం జరుగుతుంది. వరి పంటను సాగు చేయాలంటే రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. అలిరెడ్డిపల్లెలో సర్పంచు గాలి నాగరాజు 3 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే పూర్తిగా తెగుళ్లు సోకి పంట ఎర్రగా మారి పోయింది. లోమడ చంద్రారెడ్డి 3 ఎకరాలు, మహేశ్వరరెడ్డి ఎకరా, రాజా ఎకరా, డి.రమణారెడ్డి 2ఎకరాల్లో సాగు చేసిన వరి పంట తెగుళ్లతో పూర్తిగా దెబ్బతింది. తూపల్లె ప్రాంతంలో కూడా వరి పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటను సాగు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. పైర్లకు రోగాలు ఆశిస్తే ఏ మందులు వాడలో చెప్పే నాథుడులేడని రైతులు ఆరోపిస్తున్నారు. పంట చేతికొచ్చే వరకు రైతుకు నమ్మకంలేదని వాపోతున్నారు. పంట చేతికి రాక ముందే లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. బోర్లలో ఉన్న అరకొర నీటితోనే పంటలను సాగు చేస్తున్నప్పటికీ తెగుళ్ల బెడద ఎక్కువైందని అంటున్నారు. తెగుళ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
వరి సాగు చేసినా ప్రయోజనం లేదు
ఆదాయం బాగుంటుందని ఆశతో 3 ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. పంట సాగు చేసి ఒకటిన్నర నెల అయ్యింది. వరి పంటకు ఎకరాకు రూ.20వేలకు పైగా ఖర్చు చేశాను. పంటకు తెగుళ్లు సోకడంతో పూర్తిగా ఎర్రగా మారిపోయింది. ఎర్రదుమ్ము రోగం సోకడంతో మూడె కరాల్లో వరి దెబ్బతింది. లక్ష రూపాయలుపైగా నష్టం.