
కడప ప్రతినిధి : ఎర్రచందనం అడవులు కౌంట్ డౌన్ అయ్యాయి. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, కర్నూలు జిల్లాలో కూడా కొంత మేరకు విస్తరించిన ఎర్రచందనం అడవులు స్మగ్లర్ల గొడ్డలి పోటుకు అంతరించి పోయేదిశకు చేరుకున్నాయి. శేషాచలం పాలకొండలు, లంకమల, నల్లమల అడవుల్లో ఉన్న ఎర్ర అడవులు కనుమరుగవుతున్నాయి. దాదాపు ఇప్పటికే 80 శాతం నాణ్యమైన సంపద స్మగ్లర్ల గొడ్డలి పోటుకు గురై ఎల్లలు దాటిందని చెప్పుకోవచ్చు. అటవీ శాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారులే ఎర్రచందనం అడవులు మాయమవుతున్నాయని, ఇప్పుడు క్వాలిటీ కలిగిన ఎర్రచందనం చెట్లు కనిపించడం గగనంగా మారిందని మాట్లాడుకోవడం చూస్తే భవిష్యత్తులో పూర్తిగా కనుమలు అవుతాయా అన్న ఆందోళన తప్పడం లేదు.నరికేసిన మొదుల్ల నుంచి మళ్లీ చిగుళ్లు వచ్చి చెట్లు అయితే తప్ప మరో రెండు, మూడు దశాబ్దాలు నాణ్యమైన ఎర్రచందనం గగనమనే వాదన వినిపిస్తోంది. ఆంతర్జాతీయ మార్కెట్లో టన్ను రెండు కోట్ల రూపాయల కాసులు కురిపించే ఎర్రచందనం కనుమరుగు కావడం రాయలసీమ, నెల్లూరు వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది
1.90 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం
రాయలసీమ జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉంటే ఇందులో ఉమ్మడి కడప జిల్లాలో 2.70 లక్షల ఎకరాలు అడవులు ఉన్నాయి. ఇందులో 1.90 లక్షల ఎకరాల్లో అత్యంత విలువైన ఎర్రచందనం అడవులు విస్తరించాయి. ఉమ్మడి జిల్లాలోని శేషాచలము, పాలకొండ, లంకమల తో పాటు కొంత భాగం నల్లమల ఫారెస్ట్ లో కూడా ఎర్రచందనం విస్తరించి ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకని ఈ ఎర్రచందనం ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకం ఎర్ర అడవులను టార్గెట్ చేసి స్మగ్లర్లు పంజా విసిరారు. రెండు మూడు దశాబ్దాలుగా దొరికిన కాడికి నరికి తరలించారు. ఇప్పుడు చెట్లు అంతరించే దశకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
యథేచ్ఛగా ఎల్లలు దాటిన దుంగలు
2011-12 నుంచి 201516 వరకు యథేచ్ఛగా ఎర్ర దుంగలు ఎల్లలు దాటాయని అటవీశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నట్లు సమాచారం. అప్పట్లో 10 సార్లు స్మగ్లర్లు అడవుల నుండి ఎర్ర దుంగలను దాటిస్తే ఒకటి రెండుసార్లు మాత్రమే పట్టుకోవడం జరుగుతూ వచ్చింది. అప్పట్లో అధికారుల కళ్లుకప్పి వీటిని తరలించడం జరిగిందా? కొన్నిచోట్ల వీరు చూసి, చూడనట్లు వ్యవహరించారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా తమిళ స్మగ్లర్లు, కూలీలు,వారికి ఈ ప్రాంతం నుంచి సహకరించే వారు ఎర్రచందనం అడవులు నరికి తరలించడంతో ఇప్పుడు ఎర్రచందనం చెట్లను వెతుక్కునే పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు
బీట్ రిపోర్ట్స్ గాలికి?
అటవీశాఖ సర్కులర్ నెంబర్ 1395 ప్రకారం ప్రతి మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి ఆయా బీట్ల పరిధిలో ఒత్తిడిని బట్టి తనిఖీలు చేసి ఎన్ని చెట్లు ఉన్నాయి. ఏ ఏ రకం చెట్లు ఉన్నాయి. వాటిలో ఎన్ని నరికేశారు, ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి. ఇలా లెక్క కట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకారం బీట్ రిపోర్టు తయారు చేస్తూ వచ్చి ఉంటే ఎర్రచందనం చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నరికేశారు అనే వివరాలు ఎప్పటికప్పుడు అటవీ అధికారులకు అందుబాటులో ఉండేవి. అయితే ఆ సర్కులర్ నిబంధనలే గాలికి వదిలేసినట్లు చెప్పుకుంటున్నారు. అసలు ఎర్రచందనం సంపద ఈ మేరకు ఉంది, ఎంత మేరకు అంతరించింది అనే సరైన లెక్కలు అటవీశాఖ దగ్గర లేనట్టు సమాచారం.
చెట్లు లేకే తగ్గిన తాకిడి
ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్దగా కనిపించడం లేదు. అటు పోలీసు, అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం రక్షణ కోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా స్మగ్లర్లపై నిఘా ఉంచినా పెద్దగా పట్టఉపడడంలేదు. నామమాత్రంగా కేసులు నమోదవుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు తగ్గడం కానీ, స్మగ్లింగ్ లేకుండా అరికట్టామని అనుకోవడం సరి కాదననే భావన వ్యక్తమవుతోంది ఎర్ర అడవులు తగ్గిపోయాయని నాణ్యమైన చెట్లు లేకపోవడం వలన స్మగ్లర్లు తగ్గారని వాదన వినిపిస్తోంది. గతంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు నిఘా పెడితే స్మగ్లర్లు మరోవైపు నుంచి అడవుల్లో దూరేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం అడవుల్లో సరుకు లేకపోవడమేనని చెప్పుకొస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్వాతే మోడీ వారిన మొద్దుల నుండి చిగురించే ఎర్రచందనం మొక్కలను కాపాడుకోవచ్చు.