ఎపి వ్యకాస ఆధ్వర్యాన పాదయాత్ర ప్రారంభం
ప్రజాశక్తి - టి.నరసాపురం
ఎర్రకాల్వ మిగులు భూముల్లో పేదల సాగుకు అవకాశం కల్పించి ఏక్‌సాల్ పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. రవి విమర్శించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని, ఈ ప్రాంతంలోని అసైన్డ్, సీలింగ్ భూములను పేదలకు పంచాలని కోరుతూ తలపెట్టిన పాదయాత్రను మండలంలోని మధ్యాహ్నపువారిగూడెంలో ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూపంపిణీ చేస్తామని ప్రకటించి అసైన్డ్ భూముల చట్ట సవరణ చేయడం దుర్మార్గమన్నారు. 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోగా ఈ చట్ట సవరణ ద్వారా 20 ఏళ్లు ఎవరైతే ఎంజారుమెంట్‌లో ఉన్నారో వారికే పట్టాలిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేదల చేతుల్లో ఉన్న భూములను భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎర్రకాల్వ మిగులు భూములు పట్ల చింతలపూడి ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా, పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు స్పందించి పేదలకు, దళితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 30 ఏళ్ల నుండి ప్రభుత్వ భూములను అక్రమంగా, దౌర్జన్యంగా భూములమ్మేసిన భూస్వాములే సాగు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖాధికారులు పేదలకు అన్యాయం చేస్తూ భూస్వాములిచ్చే లంచాలు మింగి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం ఎర్రకాలువ రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు 3500 ఎకరాలు భూసేకరణ చేసిందన్నారు. ఈ భూముల్లో సుమారు మూడు వేల ఎకరాలు మిగులుగా ఉందని, ఆ భూములకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో పేదలకు సాగుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనితోపాటు ఏక్‌సాల్ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలు, దళితులు, గిరిజనులు సాగు చేస్తున్న వారిపై ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. చట్టాలు ధిక్కరించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే భూస్వాములు చట్ట విరుద్ధంగా పామాయిల్, జామాయిల్, కొబ్బరి తదితర వాణిజ్య పంటలు వేసి సాగు చేస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో లక్షలాది అసైన్డ్, సీలింగ్ భూములను భూస్వాములు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమన్నారు. 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణకు పూనుకుందన్నారు. భూస్వాములకు రెడ్‌కార్పేట్ పరిచిన విధంగానే వ్యవహరిస్తుందన్నారు. పేదలు సాగు భూములను భూస్వాములకు కట్టబెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహారం ఉందని వ్యక్తం చేశారు. చింతలపూడి, నూజివీడు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పేదల భూములు ఆక్రమణలో ఉన్నాయన్నారు. ఎవరైతే ఆక్రమించుకున్న భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల్లో వందలాది ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మడకం సుధారాణి, అందుగుల ప్రభాకర్, జి.సూర్యకిరణ్, పి.చంటి, స్థానిక నాయకులు బుద్దులు రామలక్ష్మి, బుద్దులు దుర్గ, గంగభవాని, కుంజా చల్లమ్మ, కుంజా అక్కమ్మ, కె.సుబ్బారావు పాల్గొన్నారు.










