Jul 28,2023 01:37
వైద్యశాలలో బిడ్డ తల్లులకు పండ్లు పంపిణీ చేస్తున్న రోటరీ క్లబ్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి-చీరాల: చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు ధీటుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుభాషిణి అన్నారు. మాతా శిశు సంరక్షణకు అందరి కృషి అవసరమని ఆమె పేర్కొన్నారు. గురువారం రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో మాతా శిశుసంరక్షణ కార్యక్రమంలో భాగంగా 32 మంది పిల్లలకు జుబ్బాలు, తల్లులకు పండ్లు, రొట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుభాషిణి మాట్లాడుతూ.. చీరాల ఏరియా ఆసుపత్రిలో నాణ్యమైన సేవలను అందిస్తున్నామని, ఎటువంటి ఆపోహలు చెందకుండా చికిత్స నిమిత్తం ధైర్యంగా ఆసుపత్రికి రావాలన్నారు. ఈ నెలలో 113 మంది మహిళల్లో 50 మందికి మాత్రమే అత్యవసరమైన శస్త్రచికిత్సలు చేశామని, మిగిలిన వారికి సాధారణ కాన్పు చేసినట్లు చెప్పారు. ప్రతి తల్లి తన బిడ్డకు అరు నెలలు క్రమం తప్పకుండా తల్లిపాలనే ఇవ్వాలని, అనంతరం పాలతోపాటు కొద్దికొద్దిగా ఆహారాన్ని పెట్టాలని తెలియజేశారు. రోటరీ క్లబ్‌ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ ఐ బాబురావు, ప్రతినిధులు మామిడాల శ్రీనివాసరావు, పోలుదాసు రామకృష్ణ, బి హేమంత కుమార్‌, డీవీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.