Sep 21,2023 21:28

బంధువులు ఆందోళన
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. గురువారం పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే ఆపరేషన్‌ చేసి మృతిచెందిన శిశువును అప్పగించారని బాధితులు వాపోతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన సజ్జ మురళీకృష్ణ కుమార్తె హేమలతకు రాజమండ్రికి చెందిన ఉల్లి వీరబాబుకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గతంలో ఒక బిడ్డ డెలివరీకి ఆపరేషన్‌ చేశారు. రెండో బిడ్డ పురిటి కోసం హేమలతను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన హేమలతను ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఇంజక్షన్‌ ఇచ్చి ఆదివారం ఇంటికి పంపారని బంధువులు తెలిపారు. మళ్లీ గురువారం హేమలతకు నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చామన్నారు. ఆపరేషన్‌ చేసి బిడ్డను అందిస్తారని ఆశతో ఎదురుచూస్తున్న తమకు మృతిచెందిన శిశువును చేతుల్లో పెట్టారని కన్నీరు పెట్టుకున్నారు. కనీసం కడుపులో బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ దశలో ఆసుపత్రి ముఖద్వారం వద్ద బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు.
ఈ సంఘటనపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బేబీకమల వివరణ ఇచ్చారు. గర్భిణీ హేమలతను 16వ తేదీ ఆసుపత్రికి తీసుకు వచ్చారని, దీంతో పరీక్షించి, నెలలు పూర్తిగా నిండకపోవడంతో మందులిచ్చి ఇంటికి పంపామన్నారు. మళ్లీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నొప్పులతో బాధపడుతున్న హేమలతను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. గతంలో ఆపరేషన్‌ జరిగి ఉన్న హేమలత నొప్పులతో బాధపడటం చూసి వెంటనే ఆపరేషన్‌కు సిద్ధం చేశామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ప్రాణానికి హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నామన్నారు. ఆపరేషన్‌ చేసే సమయానికి కడుపులో మగ బిడ్డ మృతి చెంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆస్పత్రికి తీసుకురాకముందే బిడ్డ మృతిచెంది ఉంటుందని తెలిపారు. అందువల్ల తీవ్ర నొప్పులతో బాధపడుతున్న హేమలత ప్రాణానికి హాని కలగకుండా వెంటనే చికిత్స చేశామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడా లేదని వివరించారు. అనంతరం కొద్దిసేపటికి బాధితులు ఆందోళన విరమించారు.