ప్రజాశక్తి - ఏలూరు
ఏలూరు ఏరియా ఆసుపత్రి కొనసాగించి, జిల్లా ఆసుపత్రిలో రద్దు చేసిన 40 వైద్య పోస్టులు, 350 బెడ్స్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ఏలూరుకు మెడికల్ కాలేజీ రావడం సంతోషమేనని, ఆ పేరుతో ఏలూరులో ఉన్న జిల్లా ఆసుపత్రి వైద్య సేవలు రద్దు చేయడం అన్యాయమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల వైద్యంపై శ్రద్ధ లేదని విమర్శించారు. కరోనా సమయంలో కేంద్రంలో బిజెపి మంత్రులు, నాయకులు గోమూత్రం తాగితే కరోనా తగ్గుతుందని ప్రచారం చేశారని గుర్తు చేశారు. చివరకు వారికి కరోనా వస్తే ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారన్నారు. వైద్య రంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కనీసం ఐదు శాతం నిధులు కేటాయించాలని మేధావులు, ప్రతిపక్ష పార్టీలు కోరుతుంటే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సమస్యలన్నీ నవరత్నాలతోనే పరిష్కారమవుతాయని నమ్మబలుకుతున్నారని అన్నారు. విద్య, వైద్యం వంటి ప్రజల మౌలిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో 21 లక్షలు జనాభా ఉందని, ఆ మేరకు జిల్లాలో ఆ ఏరియా ఆసుపత్రులు లేవని అన్నారు. 18 లక్షలు జనాభా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ఏరియా ఆసుపత్రులుంటే, ఏలూరు జిల్లాలో మూడు ఆసుపత్రులే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏలూరులో వైద్య సేవలందిస్తున్న జిల్లా ఆసుపత్రి రద్దు కావడంతో పేదలకు సత్వర వైద్య సేవలు అందడం లేదన్నారు. జిల్లాలో ఏలూరుతోపాటు దెందులూరు, కైకలూరు ప్రాంతాల్లో కూడా ఏరియా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు మెడికల్ కాలేజీలో అన్ని స్పెషలిస్ట్ వైద్య యూనిట్లకు అనుమతులు రాలేదని, వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సిపిఎం నగర కార్యదర్శి పళ్లెం కిషోర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాల అందుబాటులోకి రాకుండా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో 40 స్పెషలిస్ట్ వైద్య పోస్టులు, 350 బెడ్స్ రద్దు చేయడం అనాలోచిత చర్యని అన్నారు. ఏలూరు ఆసుపత్రిలో రోగులకు నిర్వహించాల్సిన స్కానింగ్, ఇతర పరీక్షలకు బయట ల్యాబ్‌లకు పంపకుండా అన్నీ ఆసుపత్రిలోనే ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, జి.రవికిషోర్, వివివిఎన్.ప్రసాద్, జె.గోపి, మంచెళ్ల ఇసాక్, ఎస్.సత్యనారాయణ, ఏసుబాబు, చల్ల పైదియ్య, నర్సింహమూర్తి, రుక్మనందరావు, రాజేష్, ప్రభు, మీసాల సత్యం పాల్గొన్నారు










