Aug 13,2023 00:01

సెర్ఫ్‌ సిఇఒ కోసం ఎదురు చూస్తున్న బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు, సిపిఎం, గిరిజన సంఘం నేతలు

- తక్షణమే పూర్తి సాయి విచారణ చేపట్టాలి
- సిపిఎం, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం
ప్రజాశక్తి-రంపచోడవరం

రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్‌పిఒ)లో జరుగుతున్న అవకతవకలపై కొంతమంది బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంపచోవవరం వచ్చిన సెర్ఫ్‌ సిఇఒ, వాటిపై మాట్లాడకుండా వెళ్లిపోవడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్ల వాణిశ్రీ, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇ.సిరిమల్లి రెడ్డి పేర్కొన్నారు. రంపచోడవరంలో సెర్ఫ్‌ సీఈవో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఈవోకు సమస్యలను వివరించడానికి ఎదురుచూస్తున్న బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (బిఒడి)లను సిపిఎం, గిరిజన సంఘం నేతలు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాణిశ్రీ, సిరిమల్లిరెడ్డి మాట్లాడుతూ ఎఫ్‌పిఒలో అవకతవకలపై ఈ నెల 7న కొంత మంది బిఒడిలు విజయవాడ వెళ్లి సెర్ఫ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనికి స్పందించిన ఆయన సెర్ఫ్‌ సీఈవోని పంపించి సమస్యలన్నీ సరి చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మేరకు రంపచోడవరంలో సెర్ఫ్‌ సీఈవో పర్యటించారని చెప్పారు. అయితే రంపచోడవరం వచ్చిన సీఈవో, ఎపిఓల అవకతవకలపై బిఒడిలతో మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోటం దారుణమన్నారు. వెలుగు ఎపిడి తప్పుదారి పట్టించటం వల్లే సీఈవో వెళ్లిపోయారని, లేకపోతే ఎందుకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌తో మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, వెంటనే లెక్క తేల్చి ఎఫ్‌పిఒ ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. 2017లో సంస్థ ప్రారంభంలో రూ.65 లక్షలు ఇచ్చారని, సుమారు రూ.32.90 లక్షల జమఖర్చులు చూపిస్తున్నారని, మిగతా సొమ్ము ఏమయ్యిందో లెక్క చెప్పటం లేదని తెలిపారు. అడిగితే రూ.21 లక్షలు మాత్రమే మీకు జమ అవుతాయని చెబుతున్నారని పేర్కొన్నారు. వెంటనే సెర్ఫ్‌ అధికారులు స్పందించి బిఒడిల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిఒడిలు రేవుల జానకి రెడ్డి, పల్లాల చిన్నారెడ్డి, ములవాడ కమలాకర్‌, కదల మొట్టిరెడ్డి, ఎస్‌.భారతి తదితరులు పాల్గొన్నారు.