Sep 07,2023 00:00

మంచం మీద ఉన్న వృద్ధురాలు గౌరమ్మ

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
ఈ ఫొటోలో మంచంపైన ఉన్న వృద్ధురాలి పేరు కల్లపల్లి గౌరమ్మ. బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో ఆమె నివసిస్తుంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో గౌరమ్మ కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. నా అనే వారు ఎవరూ లేరు. ఇరుగు పొరుగు వారి పెట్టింది తింటూ కాలం గడుపుతుంది. గతంలో గౌరమ్మ, ఆమె అక్క నాగులపల్లి సత్యవతి ఇద్దరూ కలిసి జీవిస్తూ ఉండేవారు. కొద్ది రోజుల క్రితం సత్యవతి అనారోగ్యంతో మృతి చెందారు. సత్యవతి పేరుతో రాజాం కెనరా బ్యాంకులో రూ.15 వేలు నగదు ఉంది. ఆ డబ్బులు తీసి వైద్యం చేయించుకోవడానికి గౌెరమ్మ బ్యాంకు అధికారులను సంప్రదించారు. అయితే ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసి) కావాలని బ్యాంకు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎఫ్‌ఎంసి సర్టిఫికెట్‌ కోసం రాజాం గ్రామ సచివాలయంలో జులై 1వ తేదీన గౌరమ్మ దరఖాస్తు చేసుకుంది. ఎఫ్‌ఎంసి దరఖాస్తు నెంబర్‌ 230701339927గా సచివాలయ సిబ్బంది నమోదు చేశారు. కాని రెండు నెలలు దాటినా నేటికీ ఎఫ్‌ఎంసి సర్టిఫికెట్‌ అధికారులు మంజూరు చేయలేదు. వృద్ధురాలికి సర్టిఫికెట్‌ అందలేదు. జగనన్న సురక్ష పథకం కేవలం ప్రచారానికే పరిమితం తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని దీనిని బట్టి స్పష్టమవుతుంది. కొద్ది రోజులుగా గౌరమ్మ మంచానికే పరిమితమై చావు బతుకుల మధ్య ఉంది. తన సోదరి పేరుతో ఉన్న నగదను తీసుకోవడానికి సర్టిఫికెట్‌ను మంజూరు చేసే విధంగా అధికారులకు తెలియజేయాలని తనకు కనిపించిన ప్రతి ఒక్కరినీ గైరమ్మ వేడుకుంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎఫ్‌ఎంసి సర్టిఫికెట్‌ వెంటనే మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.