ప్రజాశక్తి-విజయవాడ: మున్సిపల్ కార్మికులకు గొడ్డలిపెట్టుగా తయారైన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నగర అధ్యక్షులు ఎస్.జ్యోతిబాస్ అన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని ఉపసంహరించాలని కోరుతూ యూనియన్ అధ్వర్యంలో స్థానిక కృష్ణలంక సత్యం హోటల్ సెంటర్‌లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబాస్ మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం రద్దు అయ్యేంత వరకు మునిసిపల్ కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని, అందుకు తమ యూనియన్ అండగా నిలుస్తుందని అన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం వల్ల ప్రతి ఉద్యోగి, ప్రతి కార్మికుడు తన ఫొటోను తానే తీసుకొని పంపించకపోతే హాజరుపడక కార్మికుడు రోజంతా పని చేసినా వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వేతనం కూడా కట్ అవుతుందని అన్నారు. వరుసగా నాలుగైదు రోజులు హాజరుపడకపోతే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. కార్మికులకు చదువు లేకపోవడం, స్మార్ట్‌ఫోన్లు మీద అనుభవం లేకపోవడం వంటి విషయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విధానం అమలైతే పండుగలు, ఇతర సెలవులు కూడా ఉండవన్నారు. చివరకు ప్రతి ఉద్యోగి, కార్మికుడు కట్టుబానిసగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. ఇటువంటి తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెడుతున్న నూతన హాజరు విధానం తక్షణం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తూర్పు సిటీ అధ్యక్షులు బి.వి.రాజు, యూనియన్ నాయకులు జి.కష్ణవేణి, శీలం దాసు, ఒ.పద్మ, పి.గోపమ్మ, బి.శ్రీను, బి.ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఉపసంహరించుకోవాలని, పెండింగ్ లో ఉన్న మూడు నెలల హెల్త్ అలవెన్స్ త క్షణమే కార్మికులకు అందించాలని, పిఎఫ్, ఈఎస్‌ఐలో ఉన్న తప్పులను సరిచేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చాపలమడుగు నాగరాజు, సామ్రాజ్యం, రమణ, పుల్లారావు, శ్రీను, కొండ, వెంకటేశ్వరావు, గురవయ్య, మారిపోగు నాగరాజు, వెంకటకృష్ణ పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్ గౌస్‌మియా, నాయకులు ఎస్ రామనాథం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పారా ఎలకమ్మ, చింతా కోటమ్మ, బి.బుజ్జి, బి.గుణ, కంది రంగమ్మ, కత్తుల మార్తమ్మ, యు.రమణ, ఎం.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.










