Aug 09,2023 21:00

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతికి వినతి
ప్రజాశక్తి - భీమవరం
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు టిహెచ్‌ఆర్‌ అమలుకు కొత్తగా తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో వస్తున్న సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతికి, ఐసిడిఎస్‌ అడిషనల్‌ పీడీ విజయలక్ష్మికి సమస్యలు విన్నవించి బుధవారం వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కళ్యాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల రెండో తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అమల్లో భాగంగా గర్భిణులు, బాలింతలకు టిహెచ్‌ఆర్‌ ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. అంగన్‌వాడీలు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ఎక్కువ ప్రాంతాల్లో పనిచేయడం లేదన్నారు. దీంతో గర్భిణులు, బాలింతలు ఫుడ్‌ బ్యాగులు తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సర్వర్లు పనిచేయకపోవడం, నమోదుకు టార్గెట్‌ పెట్టడంతో అంగన్‌వాడీలు మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరారు. స్పందించిన జిల్లా అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో వైట్ల ఉషారాణి, డి.మార్తమ్మ, విజయలక్ష్మి, రాజమణి ఉన్నారు.