
ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : వెయ్యి రోజులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలుపుతూ, న్యూస్ క్లిక్‌పై పెట్టిన ఎఫ్‌ఐఆర్ కాపీలను రద్దు చేయాలని సోమవారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి వద్ద ఎఫ్‌ఐఆర్ కాపీలను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, కోశాధికారి జి.వెంకటరమణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుందని, ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా అన్ని ప్రజాసంఘాలు ఉద ్యమంగా కార్యక్రమాలు అనేక సార్లు చేశాయని, అయినా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోలేదని, అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నట్టు ప్రకటన చేయాలని, కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న న్యూస్‌క్లిక్ వార్త ఛానల్‌పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని, ప్రత్యేకించి సంయుక్త కిసాన్ మోర్చా నడిపిన రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలిచిందన్నారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు బి.సూరిబాబు, కమిటీ సభ్యులు ఎం.కుమార్ నాయుడు, ఎన్.నాగభూషణం, జి.శ్రీను, జనార్ధన్‌్, విద్యార్థి సంఘం నాయకులు రాజు పాల్గొన్నారు.
బలిజిపేట : వెయ్యి రోజులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌కరణకు వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలుపుతూ, న్యూస్ క్లిక్ పత్రికపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని ఎఫ్‌ఐఆర్ కాపీలను స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం దగ్గర దగ్ధం చేస్తూ సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వంజరాపు సత్యంనాయడు, కెవిపిఎస్ నాయకులు రాజు, బలరామ నాయుడు, టి,భాను, పాల్గొన్నారు.