ప్రజాశక్తి- చింతూరు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం బీరబోయిన దిలీప్ అధ్యక్షతన జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అదాని, అంబాని వంటి కార్పొరేట్ల సేవలో మునిగి కార్మికులు, రైతులు, ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన కనీస ప్రజాస్వామ్య హక్కులను కాలారాస్తూ, అదేమని ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపిస్తుందని తెలిపారు. తన ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురు తిరగకుండా మతం పేరుతో ప్రజలను విడగొట్టే పాలిస్తోందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ బడ్జెట్ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేకంగానూ, ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడుదారులకు అనుకూలంగానూ ఉందన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజా అనుకూల విధానాల కోసం జరుగు చలో ఢిల్లీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు మండల అధ్యక్షులు సవలం వెంకటరమణ, కార్యదర్శి పోడియం లక్ష్మణ్, కమిటీ సభ్యులు కారం సుబ్బారావు, దారేశ్వరి, వీరమ్మ, పుష్ప, శ్రీదేవి, ముత్తమ్మ, కాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.










