ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్మిక కర్షక మహా ర్యాలీ ని జయప్రదం చేయండి - ఏఐకెఎస్
ప్రజాశక్తి - నంద్యాల
రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ అఖిల భారత కిసాన్ సభ ఏ .ఐ .కె .ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న జరుగు చలో ఢిల్లీ, కార్మిక కర్షక మహా ర్యాలీలో నంద్యాల జిల్లాలోని రైతాంగం పాల్గొనాలని ఏపీ రైతు సంఘం పిలుపు నిచ్చారు. బుధవారం నంద్యాల లోని టి . నరసింహయ్య భవన్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం టి రమేష్ కుమార్ అధ్యక్షత వహించారు . ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ . రాజశేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం పండిస్తున్న అన్ని రకాల పంటలకు ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా మద్దతు ధరలను నిర్ణయించి రైతాంగాన్ని ఆదుకునేందుకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ ఏప్రిల్ 5వ తేదీన అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా లక్షలాది మంది రైతులతో ఢిల్లీ వీధుల్లో కార్మిక కర్షగా ర్యాలీ మరియు పార్లమెంటు వద్ద ధర్నా జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు పాల్గొనాలని, రైతు సంఘం కార్యకర్తలందరూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు, కరపత్రాలు, జీపు జ్యాతాల ద్వారా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వినాశకర రైతు చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలోని రైతులందరూ ఐక్యంగా ఉద్యమించాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, విద్యుత్ బిల్లు 2022, రద్దు, స్వామినాథన్ సిఫారసులు అమలు కోసం పార్లమెంటు వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. పెరిగిన సేద్యపు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు పురుగు మందుల ధరలు తగ్గుతున్న పంట దిగుబడులు గిట్టుబాటు కానీ పంటల ధరల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవుచున్నారని అన్నారు.చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు, ఉన్నాయన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెంచేందుకే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో సబ్సిడీలు పెంచకపోగా గతం కంటే బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించి రైతాంగాన్ని మోసం చేస్తుందని, లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టుతున్న కేంద్ర ప్రభుత్వం రైతులను రుణభారం నుండి ఆదుకునేందుకు రైతుల పంట రుణాలను రద్దు చేయమని కోరితే ఒక నయా పైసా కూడా చెల్లించడం లేదని అన్నారు. కావున రైతులందరూ రాజకీయాలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










