Mar 17,2023 23:38

మాట్లాడుతున్న జిల్లా రిజిస్ట్రార్‌ జానకిదేవి, చిత్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ తదితరులు

ప్రజాశక్తి-కె.కోటపాడు
అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు రెండు సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించగా అవి సత్ఫలితాలు ఇచ్చాయని, ఏప్రిల్‌ 1వ తేదీ నుండి 139 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు చర్యలు చేపడుతున్నట్లు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌ జానకి దేవి తెలిపారు. శుక్రవారం స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొదటి దశలో అచ్యుతాపురం మండలం జి.అగ్రహారం, కోటవురట్ల మండలం చొల్లంగి పాలెం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టామని తెలిపారు. రెండవ దశలో భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడతామని, ఇప్పటికే సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్‌ సులువుగా చేసుకోవచ్చన్నారు. అనకాపల్లి జిల్లాలో 306 కోట్ల రూపాయలు రెవెన్యూ నిర్దేశించగా ఇప్పటివరకు 225 కోట్ల రూపాయలు లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. కె.కోటపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో రూ.6.44 కోట్లు వసూలు నిర్దేశించగా 4.65 కోట్ల రూపాయల లక్ష్యం పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ బంగారి వెంకటేశ్వరరావు, సీనియర్‌ సహాయకులు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.