
మదనపల్లె అర్బన్ : అధికార వైసిపి విధానాలతో ఏపీ భవిష్యత్తు ప్రమాదకరంలో పడిందని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం బెంగళూరు బస్టాండులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కక్షపూరిత రాజకీయాలకు ఏపీ కేంద్రంగా మారిందని, అప్పుచేసి పప్పుకూడు చందంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ అందాల్సిన జీతాలు 10వ తేదీ అయినా అందకపోవడం, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో అందకపోవడం రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, పిల్లల భవిష్యత్తు కోసం,అన్ని వ్యవస్థలు బాగుపడాలంటే ఎపిలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు, అభివద్ధి కోసం పరితపించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టి వేధించడం సమంజసం కాదన్నారు. నెల ఎనిమిది రోజులు ఏసీ కేటాయించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎపికి త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రాష్ట్ర ప్రజలు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటుతోనే తమ తడాఖా చూపిస్తారని ఆయన స్పష్టం చేశారు .అనంతరం పేదలకు షాజహాన్ బాష చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు జునైద్ అక్బరీ, నాగూర్ వలి, నవీన్ చౌదరి, షంషీర్, ఇంతియాజ్, నాదెళ్ల శివన్న, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్, పూలకుంట్ల హరిబాబు, బాలమాలి శేఖర్, హసీనా, నాగమణి టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.