ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల జాతీయ పోటీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మూడో రోజు బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజిలింగ్ పోటీల్లోని పలు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు పసిడి పతకాల పంట పండింది. వెయిట్ లిఫ్టింగ్ అండర్- 14 బాలికల విభాగంలో ఏపికి మూడు బంగారు పతకాలు వరించాయి. 44, 58, 63 కేజీల బాలికల కేటగిరీలలో ఏపీ బాలికలు విజయదుందుభి మోగించారు. 48, 53 కేజీల కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ బాలికలే మూడో స్థానాలను సైతం కైవసం చేసుకున్నారు. ఏపికి చెందిన వంకునవత్ కళ్యాణి 56 పాయింట్లతో 44 కిలోల కేటగిరిలో పసిడి పతకాన్ని సాధించింది. 58 కేజీల కేటగిరిలో ఏపికి చెందిన పి.అంజలి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. 63 కేజీల విభాగంలో పి.లోకేశ్వరి దివ్య కళ గోల్డ్ మెడల్ సాధించింది. 48,53 కేజీల కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ బాలికలే మూడో స్థానాలను సైతం కైవసం చేసుకున్నారు. ఈ రెండు వరుస విభాగాల్లో సుజాత, పి.స్వప్న చివరి స్థానంలో నిలిచారు. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ 184 పాయింట్లతో ఓవరాల్ టీమ్ ఛాంపియన్‌ను కైవసం చేసుకుంది. 130 పాయింట్లతో ఏపి రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒషిన్హామ్ టమ్రకర్ బెస్ట్ లిఫ్టర్‌గా గెలిచారు. బాడ్మింటన్ అండర్-14 విభాగంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విక్రాంత్ ఠాకూర్‌కు కాంస్య పతకం. నగరంలోని ఆంధ్రా లయోలా కాలేజీలో జరుగుతున్న ఈఎంఆర్‌ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కలియతిరిగారు. క్రీడలన్నీ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అక్కడ క్రీడాకారులకు అందుతున్న వసతులు, అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి, విద్యార్థులకు ఏ విధమైన లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.










