ఎపికి బిజెపి తీరని ద్రోహం : సిపిఎం
ప్రజాశక్తి - బేతంచర్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం, అన్యాయం చేసిందని, బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపుదామని సిపిఎం సీనియర్ నాయకులు వై.ఎల్లయ్య, మండల కార్యదర్శి ఆర్.ఈశ్వరయ్య, పట్టణ కార్యదర్శి వైబి.వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. మంగళవారం మండలంలోని కొలుములపల్లె, బలపాలపల్లె గ్రామాలలో ప్రచార భేరి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ లాంటి హామీలలో ఏ ఒక్కటీ మోడీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రాష్ట్రానికి ఆయువుపట్టు లాంటి విశాఖఉక్కును ఆదానికో, జిందాల్ కో, మరో కార్పొరేట్ రాబందుకో కట్టబెట్టడానికి కుట్రలు చేస్తుందన్నారు. 2024లో జరుగు సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు, కర్షకులందరూ ఐక్యమై బిజెపి ప్రభుత్వాన్ని, ఆ పార్టీతో జతకట్టే పార్టీలను ఓడించాలని వారు కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.వెంకటరమణ, నాగరాజు, చిన్న వెంకటేశ్వర్లు, అంకాలు, యువరాజు, రవికుమార్, రాముడు, ఓబులేసు, సుబ్బరాయుడు, మద్దిలేటి, శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.










