ప్రజాశక్తి-ఆలూరు
మొట్టమొదటిసారి ఆలూరు నియోజకవర్గ ఎపిడబ్ల్యుజెఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం జ్యోతిబసు భవన్‌లో పాండు రంగ అధ్యక్షతన ప్రజాశక్తి డివిజన్ ఇన్‌ఛార్జీ చంద్రశేఖర్, జిల్లా నాయకులు నాగేంద్ర ఆధ్వర్యంలో 20 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షులు మోహన్ రాజు (10 టివి), ప్రధాన కార్యదర్శి కృష్ణ (ప్రజాశక్తి) మాట్లాడుతూ... నూతన కమిటీ ఎన్నిక చేయడం పట్ల ఆలూరు జర్నలిస్టుల్లో నూతనోత్సాహం వెల్లువిరిసిందని తెలిపారు. మరింత మంది జర్నలిస్టులు ఫెడరేషన్ సభ్యత్వం తీసుకుంటారని, సంఘం మరింత బలోపేతంగా ఉండేలా కృషి చేస్తామని చెప్పారు. ఎపిడబ్ల్యుజె, జాప్ నుంచి 12 మంది జర్నలిస్టులు ఎపిడబ్ల్యుజెఎఫ్ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ తాలూకాలో ఉన్న జర్నలిస్టు మిత్రులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలో 100 శాతం ఫీజు రాయితీ కల్పించే విధంగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు గోవిందురాజులు, జగదీష్ రెడ్డి, రవి, కృష్ణమూర్తి, యూసుఫ్, వీరభద్రగౌడ్, ఉమాపతి, వీరేష్, సాయి పాల్గొన్నారు.
నూతన కమిటీని సన్మానిస్తున్న నాయకులు










