నివాళులర్పిస్తున్న కలెక్టర్
ఎపి తొలి సిఎం ఆంధ్రకేసరి
ప్రజాశక్తి-నెల్లూరు: ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో భావితరాలు పయనించాలని కలెక్టర్ ఎం హరి నారాయణన్ పేర్కొన్నారు.ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ప్రకాశం పంతులు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, స్వాతంత్య్ర సమరయోధులుగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రజా సేవకు అంకితమై ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను, జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు పోవాలన్నారు. చిన్నప్పటినుండి ఆయన దేశం కోసం చేసిన త్యాగం, చూపిన ధైర్యం , స్థైర్యం తలమానికమని, ఆనాటి సైమన్ కమిషన్ కు ఎదురు నిలబడి ముందు నన్ను కాల్చండి అంటూ తన గుండెను చూపిన ఆంధ్ర కేసరి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తన లాయరు వతిని ప్రక్కన పెట్టి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న మహనీయులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగ నిరతిని, దేశ సేవను స్పూర్తిగా తీసుకొని ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, డి ఆర్ ఓ వెంకటనారాయణమ్మ, ఏవో షఫీ మాలిక్, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.










