Jul 03,2023 00:11

ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్రంలోని దాదాపు 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు చేపట్టిన 92 రోజుల సుదీర్ఘ ఉద్యమం విజయవంతం అయిందని ఎపి జెఎసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమం విజయవంతం అయిన నేపథ్యంలో నేతలను కలిసి అభినందిస్తున్నట్టు తెలిపారు. డిఎ, పిఆర్‌సి బకాయిలు, సిపిఎస్‌ రద్దు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర 47 ప్రధాన డిమాండ్లతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌తో చర్చలు నిర్వహించగా 37 అంశాలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. పోరాటాలతో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని లిఖితపూర్వకంగా ఇచ్చిందని అన్నారు. ఉద్యోగుల చరిత్రలోనే తొలిసారిగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రతినెలా 3వ శుక్రవారం ప్రత్యేక గ్రీవిన్స్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ జిఒ జారీ చేసిందన్నారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో ఐక్యమత్యం ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నేతలు ఫణి పేర్రాజు, పితాని త్రినాథరావు, సంసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.