
ప్రజాశక్తి- హిందూపురం : సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని యూటిఎఫ్, ఏపీ ఎన్‌జిఒ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి, డిప్యూటి తహశీల్దార్‌కు వినతిని ఇచ్చారు. ఈ సందర్భంగా యూటిఎఫ్ నాయకులు మారుతీ శ్రీనివాస్, ఎన్‌జిఒ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతు 2004 సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చిన సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనిన్నారు సిపిఎస్ విధానం అమలులోకి వచ్చిన సెప్టెంబర్ 1వ తేదీన సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విద్రోహ దినంగా పరిగణిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఒపిఎస్‌ను అమలు చేయకపోగా గ్యారెంటీ లేని జీపిఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం అన్యాయమన్నారు. సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు పిలుపునిస్తే ప్రభుత్వం అధికారులు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ పోరాటానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్‌జిఒ నాయకులు సాయినాథ్, అశ్వర్థ, యుటిఎఫ్ నాయకులు బాబు, సీతాలక్ష్మి, మహంతి, గంగిరెడ్డి, చెన్నకేశవులు, రంగనాథ్, సుల్తాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.