Aug 08,2021 13:51

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సిబిఐ ఆదివారం అరెస్టు చేసింది. తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ దిగువ కోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదు చేయగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పందించవంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ ఎపి హైకోర్టు జడ్జిలను కించపరిచేలా పోస్టులు చేసిన ఐదుగుర్ని అరెస్టు చేసింది. జార్ఖండ్‌ జిల్లా జడ్జి హత్య కేసు విచారణ సందర్భంగా ఎన్‌వి రమణ మాట్లాడుతూ ' సిబిఐ ఏం చేయట్లేదు. సిబిఐ వైఖరిలో మార్పు ఆశించాం. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇది చెప్పేందుకు చింతిస్తున్నా' అంటూ న్యాయమూర్తుల రక్షణకు సంబంధించిన పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్పందించాలని కేంద్రాన్ని కోరారు. తాను బాధ్యతాయుతంగా ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు.