Jan 22,2023 00:05

సంఘటనా స్థలంలో మహిళ మృతదేశం

ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఓ మహిళ శనివారం తెల్లవారుజామున హత్యకు గురైంది. ఈ సంఘటన ఎఒబిలో తీవ్ర కలకలం రేపింది. ఒడిశా పోలీసుల కథనం ప్రకారం.... ఆంధ్ర ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధి గుంటవాడ పంచాయతీ, కాకరపాడు గ్రామ సమీపంలో మహిళ హత్యకు గురైన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గిరిజనులు శనివారం ఉదయం చూశారు. వెంటనే ఆంధ్ర ఒడిశా పోలీసులకు గిరిజనులు సమాచారం అందించారు. దీంతో ఒడిశా చిత్రకొండ సీఐ ముకుంద మిల్కా ఆదేశాల మేరకు పోలీసులు హుటా హుటీన సంఘటన ప్రదేశానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. గుర్తు తెలియని దుండగలచే హత్యకు గురైన మహిళ ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అని ఆరా తీశారు. అనంతరం సైంటిఫిక్‌ టీము, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను రంగంలో దింపి మహిళ హత్యకు గురైన ప్రదేశంలో ఆనవాళ్లను సేకరించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య మిస్టరీని చేధించడానికి స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ సహాయాన్ని ఒడిశా పోలీసులు కోరారు. దీంతో ఎస్‌ఐ రామకృష్ణ సీలేరు మెయిన్‌ డ్యామ్‌ నుంచి ఏయే వాహనాలు ఒడిశా వెళ్లాయో ఏపీ జెన్కో హోంగార్డులను అడిగి ఆరా తీశారు. అనంతరం సిసి ఫుటేజ్‌ను పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని ఒడిశా మల్కన్‌గిరి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఒడిశా పోలీసులు తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ నిబంధన ప్రకారం 72 గంటలు భద్రపరిచి అనంతరం మృతురాలు వివరాలు నిర్ధారణ కాకపోతే పంచినామా చేసి పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేస్తామని ఒడిశా పోలీసులు తెలిపారు.