ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో దాగి ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు శనివారం క్యూ కట్టారు. ద్విచక్ర వాహనాలపై నిడదవోలు నుంచి రాజమండ్రి మీదగా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు. రంపచోడవరం పచ్చటి అడవులు ఎత్తైన కొండలు, కోనలు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. అదే రహదారి గుండా వారి ప్రయాణం కొనసాగిస్తూ మోతుగూడెం మీదగా పోల్లూరు చేరుకొని వాటర్ ఫాల్స్ తిలకించారు. పర్యాటకులు ద్విచక్ర వాహనాలపై దారి పొడవునా ప్రకృతి అందాలు తిలకిస్తూ సాయంత్రం సీలేరు చేరుకున్నారు. స్థానిక జలవిద్యుత్ కేంద్రం, రిజర్వాయర్లు, సీలేరు పరిసర ప్రాంతాలు మంచుతో మైమరిపిస్తున్న అందాలను తిలకించి ఎంతో అనుభూతిని పొందారు. సీలేరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసుగెడ్డను సందర్శించారు. దారకొండ ఆలయానికి చేరుకొని ఎత్తైన రెండు కొండల నడుమ జాలవారే జలపాతాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. గూడెం, చింతపల్లి కాఫీ, మిరియాలు తోటలు, పచ్చటి అందాలను తిలకించారు. అదే రహదారి గుండా లంబసింగి చేరుకొని రాత్రి పర్యాటకుల బస చేశారు.










