Oct 12,2023 20:44

ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - కురుపాం :   ఏనుగుల వల్ల పంటలు, ఇళ్లు నష్టపోయిన గిరిజనులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం ఆదివాసీ గిరిజన సంఘం నాయకులతో కలిసి తిత్తిరి ముత్రినాయుడుగూడ, బొడ్డుమానుగూడ, గుమ్మడిగూడ, నేరడిమానుగూడ, జీడిగూడ, కమలగూడ, ఇప్పలమానుగూడ, గుండాం, డిి.గుండం గ్రామాలను పర్యటించి ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను, ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా ఏనుగులు గిరిజన గ్రామాల్లో తిష్ట వేసి పంటలను ధ్వంసం చేస్తూ ఇళ్లను కూలదోస్తూ విధ్వంసం సృష్టిస్తుంటే అధికారులు ఒక్కసారి కూడా పర్యటించి, పంట నష్టాలను పరిశీలించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గంటె, రాగులు, వరి, అల్లం, పసుపు పంటలను మొత్తం ధ్వంసం చేశాయన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ స్పందించి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పంట నష్టాలు ధ్రువీకరించి ఒక్కో ఎకరానికి రూ.25వేలు చొప్పున పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఎం.నాగేశ్వరరావు, తెంబు, తిరుపతిరావు, సారంగో తదితరులు పాల్గొన్నారు.