Oct 16,2023 21:50

డిఎఫ్‌ఒ కారుకు అడ్డంగా నిల్చొన్న గిరిజన, ప్రజా సంఘాల నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సోమవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం, రైతుసంఘం, వ్యకాస, ఐద్వా, సిఐటియు ఆద్వర్యాన ధర్నా చేపట్టారు. అటవీశాఖ సిబ్బంది ముందుగా కార్యాలయ గేట్లకు తాళాలు వేశారు. దీంతో కార్యాలయం ముందే కూర్చుని నిరసన తెలియజేశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన డిఎఫ్‌ఒ కారును చుట్టుముట్టి ఘెరావ్‌ చేశారుక. పోలీసుల జోక్యంతో ఆమె కార్యాలయంలోకి గిరిజనులను, నాయకులను అనుమతించారు. అనంతరం డిఎఫ్‌ఒను కలిసి వినతి సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోకి 2000 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవేశించాయని, అధికారులు గిరిజనుల కష్టాలను గమనించి, ఆపరేషన్‌ గజ పేరుతో తరలించారని గుర్తుచేశారు. 2018లో మళ్లీ ఒడిశా నుంచి జిల్లాలోకి ప్రవేశించి, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సరచరిస్తున్నాయని తెలిపారు. అడవి నుండి వచ్చిన ఏనుగులు ప్రజలకు పెను సమస్యగా మారి, ఇప్పటికి 11 మంది ప్రాణాలు బలిగొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.4 కోట్లు మేర పంట, పశు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి బీభత్సాన్ని సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు చర్యలు నామమాత్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన వారికి బకాయి పరిహారం చెల్లించాలన్నారు. పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన స్పందిస్తూ సాంకేతిక సమస్యల వల్ల కొందరు బాధితుల విషయమై జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. తన దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఏనుగుల సమస్యపై అధ్యయనం చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఏనుగుల గుంపును మచ్చిక చేసుకుని వాటిని అదుపులోకి తీసుకునేందుకు రెండు మచ్చిక ఏనుగులు (కొంకీలు) రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన ఏనుగులను సంరక్షించేందుకు జోగింపేట అటవీప్రాంతాన్ని గుర్తించామని, త్వరలోనే కార్యాచరణ మొదలైతే ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, కోశాధికారి జి.వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొల్లి సాంబమూర్తి, కోరాడ ఈశ్వరరావు, నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంటుదాసు, తదితరులు పాల్గొన్నారు.