Oct 15,2023 20:42

ఆర్తాంలో సంతకాలు సేకరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - కొమరాడ :  జిల్లాలో తిష్ట వేసిన ఏనుగుల గుంపును శాశ్వతంగా అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతూ సోమవారం పార్వతీపురంలోని డిఎఫ్‌ఒ కార్యాలయం వద్ద చేపడుతున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వాకాడ ఇందిర పిలుపునిచ్చారు. ఆదివారం కల్లికోట, దుగ్గి, ఆర్తాం, గుణానపురం, పరశురాంపురం, చంద్రంపేట, మార్కొండ పుట్టి గ్రామాల్లో సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ ఏనుగులను అడవికి లేదా జూకి తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ తలపెట్టిన ధర్నాకు రావాలని ప్రజలంతా రావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ 2017లో ఒడిశా నుంచి అటవీ ప్రాంతం గుండా జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు వల్ల 11 మంది చనిపోగా, రూ.4 కోట్ల ఆస్తి, పంట నష్టం జరిగిందన్నారు. ఇలాంటి సందర్భంలో ఏనుగుల వెనకాల అటవీ శాఖ అధికారులు తిరగడమే తప్ప ఫలితం ఏమాత్రం రాని పరిస్థితి ఉందన్నారు. ఏనుగుల సంచారంతో రైతులు పంటలు పండించుకోవడానికి, పొలాలకు వెళ్లడానికి భయభ్రాంతులకు గురవుతున్నార న్నారు. ఇంత జరుగుతున్నా మన పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వెంటనే ఏనుగులను అడవికి లేదా జూకు తరలించి రైతులకు పండించిన పంటలకు భరోసా కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఏనుగులను తరలించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పి నేటికీ ఐదు నెలలైనా ఎక్కడా ఏనుగులను తరలించే విషయంలో అధికారులు ఒక్క మాట ఆడని పరిస్థితి ఉందని తెలిపారు. కావున ఇప్పటికైనా అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు సమన్వయంతో ఏనుగులను అడవికి లేదా జూకి తరలించే వరకు పోరాటం ఆగదని అన్నారు. ఇందులో భాగంగా సోమవారం డిఎఫ్‌ఒ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టినట్టు తెలిపారు.ఈ ధర్నాకు పెద్దసంఖ్యలో ఏనుగుల బాధిత గ్రామస్తులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.