
ప్రజాశక్తి - కురుపాం : ఏనుగులతో పంటలు, ఇళ్లు నష్టపోయిన గిరిజనులను ఆదుకొని వాటి బారి నుంచి గిరిజనులకు రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో తిత్తిరి పంచాయతీలో పలు గిరిజన గ్రామాల్లో ఏనుగుల వల్ల పంట నష్టపోయిన బాధితులు హెచ్.నాగేశ్వరరావు, అడ్డాయి, గోవిందాతో కలిసి ధ్వంసమైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలలుగా ఏనుగులు 12 గిరిజన గ్రామాల్లో తిష్ట వేసి పంటలను ధ్వంసం చేస్తూ ఇళ్లను కూలదోస్తూ విధ్వంసం సృష్టిస్తుంటే అధికారులు ఒక్కసారి కూడా పర్యటించి, పంట నష్టాలను పరిశీలించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గంటె, రాగులు, వరి, అల్లం, పసుపు పంటలను మొత్తం ధ్వంసం చేశాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం పరిహారం గిరిజనులకు ఇచ్చి ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఎం.నాగేశ్వరరావు, తెంబు, తిరుపతిరావు, సారంగా తదితరులు పాల్గొన్నారు.
భయాందోళనలో గొట్టివలసవాసులు
గరుగుబిల్లి : మండలంలోని గొట్టివలస పరిధిలో ఏనుగులు సంచరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అరచేతిలో ప్రాణం పెట్టుకుని గత రెండు రోజులుగా ఆ గ్రామస్తులు ఉంటున్నారు. సంబంధిత అధికారులు ఎందుకు వీటిని అడవులకు తరలించట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఏనుగుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నా వీటిని తరలించే విషయంలో చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.