Nov 13,2023 23:45

ప్రజాశక్తి - వినుకొండ : ప్రధాన రహదారులు గోతులమయమై, ప్రమాదాలకు నిలయంగా మారి జనం ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చలనం కరువైంది. కనీస మరమ్మతులకైనా రహదార్లు నోచుకోవడం లేదు. మండలంలోని వినుకొండ- అద్దంకి రాష్ట్ర హైవే ఏనుగుపాలెం రహదారి గోతుల మయమై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కోటప్ప నగర్‌, గాంధీనగర్‌, గోనుగుంట్ల వారి పాలెం, ఏనుగుపాలెం, ఉమ్మడివరం, పిట్టం బండ, చెట్టుపల్లి, గోకనకొండ, నాగులవరం, ప్రకాశం జిల్లా సంఘం, గొర్రెపాడు, కొప్పెరపాడు జాతీయ రహదారి వరకు ఉన్న సుమారు 15 గ్రామాలకు పైగా ప్రజలు నిత్యం ఈ రహదారి నుండి రాకపోకలు సాగిస్తుంటారు. నాలుగేళ్లుగా ఈ రహదారి పెద్దపెద్ద గోతులు ఏర్పడి వాహన చోదకులకు భయపెడుతోంది. ఇప్పటికే పలు ప్రమాదాల్లో కొందరు చనిపోగా, అనేక మంది గాయపడ్డారని, దీనిపై ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని జనం చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ ఈ రహదారిరి విస్మరించిన ప్రభుత్వం తాజాగా నిర్మాణానికి టెండర్‌ పిలవగా కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదు. పనులు చేస్తే బిల్లు రావనే అభిప్రాయమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఆదమరిస్తే ప్రాణం పోవడమే..
దావులూరి వీరాంజనేయులు ఏనుగుపాలెం
రమణారావు, ప్రముఖ న్యాయవాది.

ఏనుగుపాలెం రోడ్డులో రాత్రివేళ ఆదమరిస్తే అంతే సంగతులు. ఈ రాష్ట్ర రహదారి నాలుగేళ్లగా అధ్వానంగా మారి ప్రాణాలను హరించే రోడ్డుగా మారింది. నడుము లోతు గుంతలతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే జనం బాధ ఎలా ఉందో అర్థమవుతుంది. రోడ్డు నిర్మాణం చేపట్టకున్నా కనీసం గుంతలైనా పూడ్చాలి. లేకుంటే న్యాయపరంగా పోరాడతాం.
కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు
గోపికృష్ణ, ఆర్‌ అండ్‌ బి, డిఇఇ.

వినకొండ-అద్దంకి రాష్ట్ర హైవేకు రూ.19 కోట్లు మంజూరయ్యాయి. వినకొండ నుండి ప్రకాశం జిల్లా సంఘం వరకు 21 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి టెండర్‌ పిలిచాము. సెప్టెంబర్‌ 25 టెండర్‌ గడువు వరకు ఎవరు రాకపోవడంతో అక్టోబర్‌ 24 వరకు టెండర్‌ ప్రక్రియను పొడిగించాం. టెండర్‌ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం.