Mar 27,2023 22:57

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఎన్‌టిటిపియస్‌లో ప్రమాదాల నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రచురించిన కరపత్రాన్ని సోమవారం కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, మండల కార్యదర్శి ఎం.మహేష్‌ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ ఎన్‌టిటిపియస్‌లో కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, రక్షణ సదుపాయాలు, పనిముట్లపై ఆడిట్‌ చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ పిఎఫ్‌, ఈఎస్‌ఐ గ్రాడ్యూటీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాలు అమలు కోసం కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఇటీవల ఎన్‌టిటిపియస్‌ 5వ స్టేజీలో పనిచేస్తున్న జితేంద్ర, చోటుసింగ్‌ లిఫ్ట్‌ ప్రమాదంలో మరణించారన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే కార్మికులు మృతిచెందారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలకు బాధ్యత ఎన్‌టిటిపియస్‌ యాజమాన్యం తీసుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసుదేవన్‌, కొండలరావు, బాబ్జీ, పాపయ్య, అప్పారావు, రాజు, కృపారావు పాల్గొన్నారు.