Mar 11,2023 00:11

వివిధ పోటీల్లో విజేతలతో ఎన్‌టిపిసి అధికారులు

ప్రజాశక్తి - పరవాడ
ఎన్టీపీసీ సింహాద్రిలో ఈనెల 4 నుండి జరుగుతున్న 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ప్లాంట్‌ ఆవరణలోని సేఫ్టీ పార్క్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సురేష్‌, సింహాద్రి గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ సంజరు కుమార్‌ సిన్హా, జిఎమ్‌ డిపి.పాత్ర, ప్రాజెక్టు జిఎమ్‌ ఎస్‌కె.ఝా, హెచ్‌ఆర్‌ రుమా దే శర్మ పాల్గొని భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గౌరవ అతిథి వి.సురేష్‌ మాట్లాడుతూ వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత నిర్వహణలో సింహాద్రి ప్రాజెక్ట్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు. భద్రత, ఆరోగ్యం, పర్యావరణ సమస్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింహాద్రి జిఎమ్‌ సిన్హా మాట్లాడుతూ సింహాద్రి స్టేషన్‌లో ప్రమాద రహిత పని వాతావరణాన్ని పెంపొందించడానికి మేనేజ్‌మెంట్‌ కట్టుబడి ఉందని తెలిపారు. జిఎమ్‌ డిపి.పాత్ర మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు అన్ని భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జీవితంలో భద్రత ప్రాముఖ్యతపై సేఫ్టీ స్కిట్‌ను సేఫ్టీ స్టీవార్డ్‌ ప్లే చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ వారం రోజుల్లో వ్యాస రచన, స్కిట్‌ పోటీలు, స్లోగన్‌ కంప్లీషన్‌, సేఫ్టీ క్విజ్‌ కంప్లీషన్స్‌, సేఫ్టీ పోస్టర్స్‌ కంప్లీషన్స్‌, క్లోరిన్‌ లీక్‌ అరెస్ట్‌ కంప్లీషన్‌ వంటి వివిధ భద్రతా పోటీలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ సిఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగులు, యూనియన్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు, సింహాద్రి కాంట్రాక్టింగ్‌ అసోసియేట్స్‌ పాల్గొన్నారు.