Nov 24,2022 00:03

ఎన్‌టిపిసి ఎదుట ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి - పరవాడ
పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఐదు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునగపాక మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దలాయి రాంబాబును ఆదుకోవాలని కోరుతూ ఆ కంపెనీ ఎదుట బుధవారం భారీ ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు ఉదయం 7.30 గంటల నుంచే కంపెనీ ఎదుట బైఠాయించి ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా నిలుపుదల చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఎన్‌టిపిసి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌టిపిసిలో కాంట్రాక్టు కార్మికులతో స్కిల్‌ పనులు చేయించడం, ప్రమాదాలు జరిగితే పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
అనంతరం హెచ్‌ఆర్‌ డిపార్టుమెంట్‌ అధికారులు చర్చలు జరిపారు. ఆందోళనకారుల డిమాండ్‌ మేరకు బాధితుడు చికిత్స పొందుతున్న కాలమంతా వేతనంతో కూడిన సెలవులు, తరువాత పని ఒత్తిడి లేకుండా జనరల్‌ షిఫ్ట్‌ డ్యూటీ ఇవ్వడానికి, మెరుగైన వైద్యం అందించడానికి యాజమాన్యం అంగీకరించింది. కాంట్రాక్టర్‌తో మాట్లాడి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఉదయం 11 గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిపిసి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పైలా పోతి నాయుడు, లీడర్‌ రమణ, ఎం.సత్యనారాయణ, వెంకటాపురం గ్రామ సర్పంచ్‌ సుందరపు తాతాజీ, వెంకటాపురం గ్రామస్తులు, కాంట్రాక్ట్‌ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.