ప్రజాశక్తి - పరవాడ
ఎన్‌టిపిసి కాలుష్య సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ అన్నారు. ఎన్‌టిపిసి ధూళి, కాలుష్యం కమ్మేస్తున్న మండలంలోని కలపాక పంచాయతీ మూలస్వయంభువరం గ్రామంలో బుధవారం ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామమంతా సందర్శించి కాలుష్యంతో బాధపడుతున్న స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్‌టిపిసి కాలుష్యంపై గతంలో యాజ మాన్యం చర్చించామని, కాలుష్యం నివారణకు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడు తున్నారు తెలియజేశామని చెప్పారు. అయినా ఎన్‌టిపిసి యాజమాన్యం స్పందించ లేదన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం వల్ల నష్టపోయిన పంటలు, చెట్లు, ఇళ్లు, శిథిలమైన భవనాలను పరిశీలించి తగిన నివేదికను ఇవ్వాలని పిసిబి ఎఇ మూర్తి, అగ్రికల్చర్ ఎఓ చంద్రావతి ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ షణ్ముఖను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలపాక సర్పంచ్ బోండా కనకారావు, వైస్ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, పాల్గొన్నారు.










