Oct 12,2022 23:44

నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి- చింతూరు
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరును వైద్య విశ్వవిద్యాలయానికి తొలగించి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం చింతూరు టిడిపి కార్యాలయం ముందు రంప చోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ఉద్దేశించి రాజేశ్వరి మాట్లాడుతూ వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరుతో ఉండడాన్ని సహించ లేని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుట్ర పూరితంగా తొలగించి నీచమైన రాజకీయాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి, ప్రజా సమస్యలను మరిచి ప్రజలను ప్రలోభ పెట్టి నాటకమాడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ విలీన మండలాల్లో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు మొండిచెయ్యి చూపి మోడీపై పరిహార పునరావాస భారం నెట్టి వేశారని ఎద్దేవా చేశారు. ఆదివాసీలపై అటవీశాఖ వారితో దౌర్జన్య కాండ చేస్తున్నారన్నారు. భారీ వరదలకు చింతూరు, వీఆర్పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో ప్రజలు సర్వస్వం కోల్పోయారని వారికి నేటికీ ప్రకటించిన పరిహారం అందలేదన్నారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించే వరకు తాము చేపట్టిన దీక్షను విరమింపబొమ్మని హెచ్చరించారు. అనంతరం టిడిపి కార్యాలయం నుండి సంత మార్కెట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇళ్ల చిన్నారెడ్డి, ఓబుల నేని రామారావు చౌదరి, మల్లెల్లి వెంకటేశ్వరరావు, ఆకోజు నూక చారి, ముత్యాల రామారావు, ఎడవల్లి భాస్కర్‌, సాల్మన్‌ రాజు, పొదిలి రామారావు, సురేష్‌ చౌదరి, శ్రీరామ్‌, అనిగి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.