ప్రజాశక్తి-.అనకాపల్లి : తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎన్‌టిఆర్ అభిమాన సంఘం డిమాండ్ చేశారు ఆదివారం. సత్యనారాయణపురం ప్రాంగణంలో అనకాపల్లి ప్రాంత సీనియర్ ఎన్‌టిఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవంలో ముఖ్యఅతిథి టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ, తెలుగుజాతికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన ఎన్‌టిఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, సంక్షేమానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరైన ఎన్‌టిఆర్‌కు ఏ రూపంలో అవమానం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ విగ్రహ నిర్మాణానికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న ఎన్‌టిఆర్ పేరును మార్చడం, ఎన్‌టిఆర్ విగ్రహాలను తొలగించడానిన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభిమాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేదుల రామారావు, పల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినకార్యక్రమంలో లంక నాగేంద్రరావు రచించిన 'అందరి కోసం ఎన్‌టిఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కడిమిశెట్టి నరసింగరావు, సినీ ఎగ్జిబిటర్ మల్ల వెంకటరావు, పెనుమత్స వెంకటేశ్వరరాజు, వానపల్లి త్రినాథ్, వేల్పుల గణేష్, దాడి భోగ లింగం పాల్గొన్నారు.










