May 28,2022 06:50

బలమైన యంత్రాంగం, వనరులు కలిగిన తెలుగుదేశం వంటి పార్టీకి ఇది గడ్డుకాలమే. అనుకూల మీడియా కథనాలతో హడావుడి చేస్తున్నంతగా ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటం లేదనే భావం, అంతర్గతంగా నిజమైన నాయకులను కార్యకర్తలను గుర్తించలేదనే అసంతృప్తి అల్లుకుపోయాయి. వైసిపి ప్రభుత్వంపై విధానాల పరంగా సమస్యలపై పోరాటం కన్నా మీడియా, సోషల్‌ మీడియా వేదికలపై వ్యక్తిగత వివాదాలు, అప్రధానాంశాలు, అనుకూల ప్రచారాలు అధికారంలోకి తెచ్చేస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తుండవచ్చు. జగన్‌ ప్రభుత్వ దాడులు, అరెస్టులు, కేసులు కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయి. సీనియర్‌ నేతలు చాలామంది నిర్లిప్తత వహిస్తుంటే చంద్రబాబు మీదే భారం వుంటోంది. తెలుగుదేశం అంతర్గతంగా సరైన సమీక్ష, ఆత్మ విమర్శ చేసుకుని ప్రణాళికా బద్దంగా ప్రజలకు, కార్యకర్తలకు చేరువైతేనేే భవిష్యత్తు.

నందమూరి తారక రామారావు శత జయంతి. మహానటుడుగా, తెలుగుదేశం వ్యవస్థాపకుడుగా, ఎ.పి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆయనను తల్చుకునే సందర్భం. తన ఘన విజయాలు, చిత్రాల సంఖ్య కూడా అనితర సాధ్యమే. రాముడు, రావణుడు, కృష్ణుడూ దుర్యోధనుడు వంటి పూర్తి భిన్నమైన పాత్రలు కూడా ఒకే నటుడు ఒకే చిత్రంలో వేసి ప్రేక్షకులను మెప్పించిన వైనం ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే అనితర సాధ్యమైంది. ఎన్‌టిఆర్‌ పౌరాణికాలలోనే అద్భుతంగా నటిస్తారని చెప్పడం కూడా పాక్షికమవుతుంది. ఆయన సాంఘికాలలోనూ చరిత్ర కథనాల్లోనూ గొప్ప విజయాలు సాధించారు. కేవలం హీరోగా మాత్రమే గాక దర్శకుడుగానూ ఎన్‌టిఆర్‌ రికార్డు చాలా గొప్పది. ఎన్‌టిఆర్‌ కళా జీవితం ప్రజా కళల ప్రభావంతో వెలసిన ఎన్‌ఎటి నాటక సంస్థతో జరిగింది. తొలి దశలో అభ్యుదయ దర్శకులు, మహామహులు ఆయనను తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలను చాలా వరకూ పోరాటంతో పరిష్కరించుకోవాలనే సందేశం ఆయన ఎక్కువ చిత్రాల్లో వుంటుంది. పౌరాణికాలకు మానవీయ స్వర్శనిచ్చి హేతువాద ధోరణిని కూడా అలవాటు చేసిన ద్రవిడ ఉద్యమ సంప్రదాయం చూస్తాం. తమిళనాడులో నట ముఖ్యమంత్రి ఎమ్‌జిఆర్‌లా ఎన్‌టిఆర్‌ ఎప్పుడూ ఒకే మంచితనం చూపించాలని పాత్రలకు పరిధి పెట్టుకోలేదు. వీటన్నిటికి కారణం ఆయన ఒక ఇమేజి చట్రంలో ఇరుక్కుపోవడానికి సిద్ధపడలేదు. శత జయంతి వేళ ఒక మహానటుడుగా తెలుగువారు తనను స్మరించుకుంటారు.
   35 ఏళ్ల సినీ జీవితం తర్వాత, 1982 మార్చి 29న తెలుగుదేశం స్థాపన ఆయన జీవిత చరిత్రలో రెండవ అధ్యాయం. ఆ పార్టీ నవమాసాలు తిరక్కుండానే 1983లో అధికారం చేపట్టడం అసాధారణ విజయమే. అంతకు ముందు సాగిన కాంగ్రెస్‌ వ్యతిరేక ఉద్యమాల రాజకీయ ప్రభావం బాగా దోహదం చేసింది. కాంగ్రెస్‌పై వ్యతిరేకత, కళాకారుడుగా ఆయనతో సుదీర్ఘ అనుబంధం, రెండు రూపాయల కిలో బియ్యం వాగ్దానం ఇందుకు దోహదం చేశాయి. కొంతమంది ఎన్‌టిఆర్‌ తోనే ఆంధ్రుల చరిత్ర మొదలైనట్టు అతిశయోక్తిగా చెబుతుంటారు గాని అదీ నిజం కాదు. ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో మహామహులు, కాంగ్రెస్‌ కమ్యూనిస్టు నాయకులు తెలుగువారి చరిత్రను తీర్చిదిద్దారు. యాభైలలో ప్రపంచాన్నే ఆకర్షించిన ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమ విజయాలు వీర తెలంగాణ రైతాంగ పోరాటం, రాష్ట్ర సాధన వంటివన్నీ కీలక ఘట్టాలు. దేశంలో మారిన సమీకరణాలూ కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం క్షీణతలో టిడిపి విజయం మరో దశ. ఈ పరిణామాలలో కమ్యూనిస్టు ఉద్యమం ఒక ముఖ్య పాత్ర వహించింది. ఈ వాస్తవం తెలుసు గనకే ఎన్‌టిఆర్‌ సుందరయ్య గారి పట్ల ఎనలేని గౌరవం చూపేవారు. అయితే ప్రజల నాడిని సమయాన్ని పట్టుకోవడంలో ఎన్‌టిఆర్‌ ప్రత్యేకత వుంది. గద్దెక్కిన ఏడాదిన్నర లోపే కేంద్ర కాంగ్రెస్‌ కుట్రతో నాదెండ్ల భాస్కరరావు తెచ్చిపెట్టిన 1984 తొలి ఆగష్టు సంక్షోభం అధిగమించడం జాతీయ పార్టీల ప్రజాశక్తుల సహకారం లేకుంటే సాధ్యమయ్యేది కాదు. ఆ శక్తులతో కొన్ని కొలబద్దల ఆధారంగా కలసి పనిచేయడం ఎన్‌టిఆర్‌ రాజకీయ విజ్ఞతకు అద్దం పడుతుంది. అంతకు ముందున్న ద్రవిడ పార్టీలు అకాలీదళ్‌ వంటి వాటిలా గాక ఆయన వచ్చాక ప్రాంతీయ పార్టీల పాత్ర విస్తరించింది. కాంగ్రెసేతర ఐక్యత అంటూ తొలి మహానాడు లోనే జాతీయ ప్రతిపక్ష నేతలను పిలిచి శిఖరాగ్రసభ నిర్వహించారు. కేంద్రం ఒక మిథ్య అని ఎన్‌టిఆర్‌ అంటే మిథ్యా పురాణాల గురించి ఆయనకే నాకంటే బాగా తెలుసు అని ప్రధాని ఇందిరాగాంధీ చమత్కరించారు. తర్వాత ఆమే సర్కారియా కమిషన్‌ నియమించి రాష్ట్రాల హక్కులపై అధ్యయనం చేయించాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో స్పష్టత, రాష్ట్రాలకు రక్షణలు కల్పించాల్సి వచ్చింది.
 

                                                    సానుకూల అంశాలు, తప్పిదాలు

కేంద్ర నిరంకుశత్వంపై పోరాటం, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ, లౌకిక సూత్రాలకు కట్టుబాటు ఎన్‌టిఆర్‌ పాలనలో విలక్షణాంశాలు. విద్యాధికులను ఆయన రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున తీసుకురాగలిగారు. మునసబు కరణాల రద్దు, మండలి రద్దు, మండలాల ఏర్పాటు లాటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పార్టీని ముందుకు నడపడంలో కొన్ని ఆర్థిక సామాజిక శక్తులున్నాయి గనక వాటిని కాదని భూ సంస్కరణల వంటి మౌలిక మార్పులను చేయలేకపోయారు. కుటుంబ సభ్యులతో మొదలుపెట్టి టిడిపిలో అంతర్గతంగా ఐక్యత ఎప్పుడూ ఎండమావిగానే వుండింది. ఇద్దరు అల్లుళ్ల మధ్య వైరుధ్యాలతో విసిగిపోయిన ఎన్‌టిఆర్‌ 'పార్టీ నాతోనే వచ్చింది నాతోనే పోతుంది' అన్నారు. 1988లో మంత్రివర్గ సామూహిక బర్తరఫ్‌ ద్వారా తనే సర్వస్వం అని సందేశమిచ్చారు. వంగవీటి రంగా హత్యానంతరం కాంగ్రెస్‌ ప్రతివ్యూహాలు పరాకాష్టకు చేరగా తెలుగుదేశం బేలగా వుండిపోయింది. ఇన్ని ఎదురుదెబ్బలు, తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు గనకనే 1989లో ఎన్‌టిఆర్‌ తో సహా (ఒకచోట) ఓడిపోయారు. ఆ ఎన్నికలలో మతతత్వం అనర్థం పెరిగాక బిజెపి నుంచి విడగొట్టుకుని కేవలం వామపక్ష పార్టీలతో అవగాహనకు పరిమితమైనారు. బిజెపికి చోటులేని నేషనల్‌ఫ్రంట్‌ అధ్యక్షుడైనారు. 1990లో ఎల్‌.కె. అద్వానీ చేపట్టిన రథయాత్ర ఆపి అప్పటి వి.పి.సింగ్‌ నాయకత్వంలోని ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అద్వానీని ఇంటికి పిలిచి అభ్యర్థించారు. అప్పుడాయన అధికారంలో కూడా లేరు. అయినా అధికారం కోసం మత రాజకీయాలు వద్దనుకున్నారు. 1992లో అయోధ్య బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1993లో సారా వ్యతిరేక ఉద్యమ ప్రభావం గుర్తించి సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఇవ్వడం ఆయన రాజకీయ చతురతను తెల్పుతుంది. ఆ విధంగా 1994లో రెండవ సారి అద్భుతమైన ఆధిక్యతతో అధికారంలోకి వచ్చారు. అయితే దానికి ముందే లక్ష్మీ పార్వతితో ఎన్‌.టి.ఆర్‌ వివాహం అనంతర పరిణామాలు తన రాజకీయ జీవితానికి చరమ ఘట్టం. ఇద్దరు అల్లుళ్లే గాక భార్యకు కూడా పార్టీ వ్యవహారాలలో జోక్యం కల్పించడం పరిస్థితిని మార్చివేసింది. కుటుంబమంతా కలసి మరోసారి పదవి నుంచి తొలగించడం చంద్రబాబు, పదవి చేపట్టడం ఎన్‌టిఆర్‌ కు ఆఖరి దెబ్బ. నాటి తెలుగుదేశం నేతల జీవిత కథలూ జ్ఞాపకాలు చదివితే ఈ పరిణామాల వివిధ కోణాలు తెలుస్తాయి.
 

                                                          బిజెపితో చంద్రబాబు దోస్త్‌

వ్యవస్థాపకుడుగా ఎన్‌టిఆర్‌ కు నమస్కారం పెట్టినా ఇప్పుడున్న తెలుగుదేశం వ్యవస్థ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పెరిగిందే. 1996 పార్లమెంటు ఎన్నికలకు కొంచెం ముందు ఎన్‌టిఆర్‌ అనూహ్య మరణం తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు శకాన్ని ప్రారంభించింది. ఆయన కూడా వామపక్షాల మద్దతు లేకుంటే నిలదొక్కుకోవడం సులభమయ్యేది కాదు. జాతీయంగా చక్రం తిప్పారని ఆయన గురించి అదేపనిగా పొగుడుతుంటారు గాని 1996లో ఆ చక్రం ఆయన చేతిలో పెట్టింది అప్పటి సిపిఎం ప్రధాన కార్యదర్శి, జాతీయ దిగ్గజం హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, వి.పి.సింగ్‌ అనే చారిత్రిక సత్యాన్ని దాటేస్తుంటారు. అయితే చంద్రబాబు ఎన్‌టిఆర్‌ లా లౌకికతత్వానికి కట్టుబడలేదు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా వుండి 1998 తర్వాత బిజెపి ఎన్‌డిఎ తో జత కట్టారు. ప్రపంచ బ్యాంకు విధానాలతో చెలరేగిపోయారు. ఈ రెండు చర్యలకూ అంత:సంబంధం వుంది. ఈ విధానాలపై వామపక్షాలు సాగించిన వీరోచిత పోరాటమే తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమికి, వై.ఎస్‌ ప్రభుత్వం రావడానికి ఒక కారణమైంది. ఈ నలభయ్యేళ్లలో 21 ఏళ్ల కాలం తెలుగుదేశం అధికారంలో వుంది. అందులోనూ పద్నాలుగేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి. జ్యోతిబాసులా పాతికేళ్లు పాలిస్తానన్న చంద్రబాబు వరుసగా రెండవ సారి గెలిచిన సందర్భమే లేదు. ఆనాటి ప్రపంచ బ్యాంకు విజన్లు హైటెక్‌ కీర్తనలు ఎలా వున్నా ఆయన రాజకీయంగా తిన్న దెబ్బలు, రాష్ట్రానికి ఎదురుదెబ్బలు చాలా వున్నాయి. విద్యుత్‌ ఉద్యమం తర్వాత రెండుసార్లు గెలిచిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిని ఎదుర్కోవడంలోనూ రాష్ట్ర విభజన సమస్యలోనూ ఉక్కిరి బిక్కిరైన చంద్రబాబు పదేళ్లపాటు ప్రతిపక్షంలో కష్టంగానే గడిపారు. ఎ.పి విభజనకు కూడా ఆ పార్టీ అంగీకరించడానికిదే కారణమైంది. విభజనకు రెండవ ప్రధాన కారణమైన బిజెపితో పొత్తుపెట్టుకున్నారు. 2019 ఎన్నికల చివరి దశలో ధర్మయుద్ధం అంటూ జరిపిన చంద్రబాబు ఓటమి తర్వాత బిజెపిపై నోరెత్తిన సందర్భం లేదు. మోడీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల ఎంత వివక్ష కొనసాగిస్తున్నా టిడిపి విమర్శ రాష్ట్రంలో వైసిపి పాలనకే పరిమితమవుతున్నది. ఈ ప్రభుత్వ తప్పిదాలపై పోరాడటం అవసరమే గాని కేంద్రం ఏకపక్ష పోకడలను, నిధుల నిరాకరణను, మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించడం తప్పనిసరి. రామతీర్థం నుంచి ఇప్పుడు కోనసీమ వరకూ బిజెపి కుల మత రాజకీయాలను ఖండించకపోగా తానూ ఆ పల్లవి ఆలపించి ప్రయోజనం పొందే ప్రయత్నం చేశారు. జనసేన, బిజెపిలతో కలసి వచ్చేసారి పొత్తు పెట్టుకుంటారనే సంకేతాలపై స్పష్టత ఇవ్వరు. తన పాలనలో తప్పిదాలపై ఆత్మవిమర్శ చేసుకోరు.
        విభజిత ఆంధ్ర ప్రజలు బిజెపి, జనసేనల పొత్తులో 2014లో ఆయనకు అధికారం అప్పగించినా అంతకు ముందరి ఊపు లోపించడానికి కారణాలు అనేకం. కేంద్రంలో వుంటూనే రాష్ట్రానికి రావలసినవి సాధించలేకపోవడం, అమరావతి రాజధానిని ఒక దశకు తీసుకురాలేకపోవడం వాటిలో పెద్దవి. ప్రజా ఉద్యమాలపై దాడులు, అసహనం కూడా అప్పుడూ తీవ్రంగానే కొనసాగాయి. చంద్రబాబు పాలనా రీతిలో వైఫల్యాలు చుట్టూ వంధిమాగధులను చేర్చుకోవడం, తీవ్ర తప్పిదాలను కూడా సమర్థించుకోవడం, అనుచిత ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఆర్థిక దుస్థితి తెలుగుదేశం విశ్వసనీయతకు కూడా భంగకరంగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు వీటిని ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా జగన్‌ వైఎస్‌ఆర్‌సిపి చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 1994లో కాంగ్రెస్‌కు 26 స్థానాలు మాత్రమే వస్తే 2019లో తెలుగుదేశంకు 23 మాత్రమే వచ్చాయి. తెలంగాణలో అసలే ఠికానా లేకుండా పోయింది.
 

                                                       ఆత్మ విమర్శ లేకపోతే అంతే !

ఏమైనా బలమైన యంత్రాంగం, వనరులు కలిగిన తెలుగుదేశం వంటి పార్టీకి ఇది గడ్డుకాలమే. అనుకూల మీడియా కథనాలతో హడావుడి చేస్తున్నంతగా ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటం లేదనే భావం, అంతర్గతంగా నిజమైన నాయకులను, కార్యకర్తలను గుర్తించలేదనే అసంతృప్తి అల్లుకుపోయాయి. వైసిపి ప్రభుత్వంపై విధానాల పరంగా సమస్యలపై పోరాటం కన్నా మీడియా, సోషల్‌ మీడియా వేదికలపై వ్యక్తిగత వివాదాలు, అప్రధానాంశాలు, అనుకూల ప్రచారాలు అధికారంలోకి తెచ్చేస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తుండవచ్చు. జగన్‌ ప్రభుత్వ దాడులు, అరెస్టులు కేసులు కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయి. సీనియర్‌ నేతలు చాలామంది నిర్లిప్తత వహిస్తుంటే చంద్రబాబు మీదే భారం వుంటోంది. కుమారుడు లోకేశ్‌కు ద్వితీయ స్థానమిచ్చి పార్టీ లోగో పైకి తీసుకొచ్చినా ఈసారి తనే ముఖ్యమంత్రి అవుతానని ప్రతిజ్ఞ చేశారు గనక చంద్రబాబు వైఖరే కీలకం. కాని జగన్‌ ప్రభుత్వం తప్పులు చాలా వున్నా వాటితోనే తాము వచ్చేస్తామని ఆశలు పెట్టుకోవడం సులభంగా నెరవేరేది కాదు. ప్రజలు పూనకం వచ్చినట్టు ఓట్లు వేసి జగన్‌ను గెలిపించారని, వారిదే తప్పు అని ప్రజలను నిందించడం ఆక్రోశాన్ని వెల్లడిస్తుందే తప్ప పరిష్కారం చూపించదు. 1989లో ఓటమి చవిచూసిన ఎన్‌టిఆర్‌ 1991లో ప్రతిపక్షంలో వుండగానే విధానపరంగా బిజెపితో విడగొట్టుకుని గెలిచారనేది మర్చిపోరాదు. తెలుగుదేశం అంతర్గతంగా సరైన సమీక్ష, ఆత్మ విమర్శ చేసుకుని ప్రణాళికా బద్దంగా ప్రజలకు, కార్యకర్తలకు చేరువైతేనేే భవిష్యత్తు.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి