Sep 23,2022 23:47

భీమిలిలో నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు

ప్రజాశక్తి-యంత్రాంగం
భీమునిపట్నం :
ఎన్‌టిఆర్‌ పేరుతో ఉన్న హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీగా పేరు మార్పు చేయడాన్ని నిరసిస్తూ తెలుగు మహిళలు శుక్రవారం స్థానిక చిన బజారు జంక్షన్‌లో ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురిమిన లీలావతి మాట్లాడుతూ, హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్‌టిఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు
పెట్టడం ఏ మేరకు సబవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్‌టిఆర్‌కు భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీపార్వతి ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.అరుణ, బోయి రమాదేవి, బి.రమణమ్మ, కె.రమణమ్మ, టి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
పద్మనాభం : తెలుగునాడు విద్యార్థి సమైక్య నియోజకవర్గ ఉపాధ్యక్షులు కె.సమంతనాయుడు ఆధ్వర్యాన పద్మనాభం జంక్షన్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డికి తండ్రి మీద అంత ప్రేముంటే రాష్ట్రంలో మరో యూనివర్సిటీని ఏర్పాటుచేసి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో లంక సురేష్‌ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సింహాచలం: జివిఎంసి 98వ వార్డు టిడిపి వార్డు అధ్యక్షుడు పంచదార శ్రీనివాసరావు ఆధ్వర్యాన సింహాచలంలో ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాసర్ల ప్రసాద్‌, సతివాడ శంకరరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.