ప్రజాశక్తి-చీరాల: ఎన్‌సిసిలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆత్మ స్థైర్యం కలిగి ఉంటారని 23వ ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ సునీల్ గౌతమ్ అన్నారు. వీఆర్‌ఎస్, వైఆర్‌ఎన్ కళాశాలలో మంగళవారం సంయుక్త వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా సమావేశం జరుగనుంది. ఇందులో భాగంగా బుధవారం కళాశాల ఆడిటోరియంలో క్యాంప్ ఓపెనింగ్ అడ్రస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కమాండింగ్ అధికారి కల్నల్ సునీల్ గౌతమ్‌తో పాటు గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. శిబిరంలో నేర్పించే అంశాలను శ్రద్ధగా విని వాటిని పాటించాలని సూచించారు. అనంతరం క్యాడెట్ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, డ్రిల్, టెంటె పిట్చింగ్ తదితర అంశాల గురించి తెలియజేశారు. శిబిరంలో నేర్పించే అంశాలు, క్యాంప్ నిర్వాహణ, క్యాడెట్ల ప్రవర్తనపై పలు సూచనలు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ శిబిరం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ముకుందన్, అంజిరెడ్డి, బి. బాపయ్యశెట్టి, సురేష్ కుమార్, ఏఎన్‌వోలు పి సురేష్, శ్రీమన్నారాయణ, శ్రీనివాసరావు, గోపి, సురేష్, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి ఎన్సీసీ క్యాడెట్లు, సిబ్బంది పాల్గొన్నారు.










