Nov 01,2022 00:07

నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-రావికమతం:కళ్యాణపులలోవ రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతాలలో ఉన్న మైనింగ్‌ కంపెనీల ఎన్‌ఓసీలను రద్దు చేయాలని అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్‌ అజరు కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణపులోవ రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలోని పెద్దగరువు, రాయిపాలెం, తాటిపర్తి గ్రామాల మధ్యలో మైనింగ్‌ కంపెనీ ఈనెల 15న గ్రానైట్‌ బ్లాస్టింగ్‌కు పరీక్షలు చేయగా గమనించిన స్థానిక ఆదివాసీలు కంపెనీ ఏజెంట్లను తరిమికొట్టా రన్నారు.ఈ సర్వే నెంబర్లలోని భూమంతా ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉందన్నారు. ఈ భూములలో వారు జీడి మామిడి తోటలు పెంచుతూ కొంత ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. మైనింగ్‌ మొదలుపెడితే చుట్టుపక్కల ఉన్న ఆదివాసీల సాగు భూములన్ని దెబ్బతింటాయని తెలిపారు.నీటిపారుదల శాఖ అధికారులు మైనింగ్‌ కంపెనీలు ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడి ఎలాంటి అభ్యంతరం తెలియచేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సి.గణేష్‌, అసంఘటిత కార్మికుల సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.