Nov 03,2023 23:02

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం వచ్చే సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కలెక్టర్‌, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ విసి హల్‌ నుంచి కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి పి.జగదీష్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, డిఆర్‌ఒ జి. నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కె. మాధవీలత మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నియోజక వర్గాల వారీగా సమగ్ర నివేదికను సేకరించడం జరిగిందని తెలిపారు. అందుకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల సమగ్ర సమాచారం మేరకు అవసరమైన మానవ వనరులతోపాటు పోలీసు భద్రత, తదితర అంశాలపై నివేదిక రూపొందించడం జరుగుతోందని అన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో నియోజక వర్గాల వారీగా సమన్వయం చేసుకోవడం జరుగుతుందని వివరించారు. నూతన తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 1569 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌ఆర్‌ 2024 ఓటరు జాబితా కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 1569 పొలింగ్‌ కేంద్రాల వద్ద ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. నవంబర్‌ 4, 5 శని ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను ఫారం 6, తొలగింపులకు చెంది ఫారం 7, మార్పులు, చేర్పులకు చెంది ఫారం 8లను స్వీకరించడం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.