
గుంటూరు : సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఆరు నెలల సమయం ఉన్నా ఎన్నికల వ్యూహం రూపొందించడంపై వైసిపి నాయకత్వం వేగం పెంచింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, యోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ప్రాంతీయ సమన్వయకర్తలకు పలు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ (పోల్ మేనేజ్‌మెంట్)ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తగిన యంత్రాంగాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలకు, ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రధానంగా వాలంటీర్లు, గృహసారధులు, వైసిపి నాయకుల ద్వారా క్షేత్ర స్థాయిలో వివరాల సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మండలాల వారీగా వివిధ సామాజిక తరగతుల ఓటర్ల వివరాలు, ప్రధాన సామాజిక తరగతికి చెందిన ముఖ్యమైన నాయకుల వివరాలు, వారు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? వారి ప్రభావం అభ్యర్థుల విజయానికి ఏ మేరకు దోహద పడగలదు? అనే అంశాలతోపాటు ఈ నాయకులను అనుసరిస్తున్న వారి వివరాలను సేకరించాలని పార్టీ నాయకత్వానికి పంపాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు గ్రామాలు, పట్టణాల నుంచి వివరాల సేకరణకు కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా గత ఎన్నికల్లో తమకు ఓట్లు వేసిన సామాజిక తరగతుల్లో ఈసారి అసంతృప్తిగా ఉన్న వారు, వ్యతిరేకిస్తున్న వారు, అందుకు గల కారణాలను అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
గుంటూరు లోక్‌సభ పరిధిలో ఎక్కువ మంది అభ్యర్థులను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇందుకోసం వివిధ దశల్లో సర్వే చేస్తున్నారు. మొత్తం ఏడు సంస్థల ద్వారా వేర్వేరుగా సిఎం నివేదికలు తెప్పించుకుంటున్నారని ఈ ఏడు సంస్థల్లో ఒకే అభిప్రాయం వచ్చిన వారికి చెక్ పెడతారని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్రధానంగా కొన్ని సామాజిక తరగతుల వారు పార్టీకి దూరమయ్యారనే సమాచారం మేరకు అందుకు గల కారణాలను తెలుసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. సామాజిక తరగతుల వారిగా ప్రభావం చూపే నాయకులను ఇప్పటి నుంచి తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో నెలకొన్న అసంతృప్తులను చల్లార్చడానికి ముందస్తు ప్రయత్నాలు చేయాలని, అవసరమైతే జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర అగ్రనాయకుల ద్వారా హామీలు ఇప్పించాలని సూచించారు. ఇప్పటికే వ్యతిరేకిస్తున్న తరగతుల వారికి కూడా అందుతున్న సంక్షేమ పథకాలు, గత ఐదేళ్లలో జరిగిన లబ్ధి వివరాలు వివరించి వ్యతిరేకత శాతాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా వైద్యరంగంపై దృష్టి పెట్టడం ద్వారా పేదల్లో ఎంతోకొంత సానుకూలమైన పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని తలపెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య సేవలు కొంతమేరకు క్షేత్రస్థాయిలో అందుతుండగా ఈ సేవలను మరింత విస్తృత పరిచేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. గత 15 రోజులుగా ఆరోగ్య సురక్ష సభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తుందనే ప్రచారం ఉధృతం చేశారు.
(ఎ.వి.డి.శర్మ)