Feb 14,2023 23:50

విశాఖపట్నం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం)
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి రాష్ట్రంలో ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలన్నారు. నామినేషన్‌ వేసేందుకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు రూ.5 వేలు దరవతు చెల్లించాలన్నారు. నామినేషన్‌ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నామినేషను ధాఖలు చేయటం కోసం వచ్చినప్పుడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వంద మీటర్లకు వచ్చిన తరువాత మూడు వాహనాలు, అభ్యర్థితో కలిపి ఐదుగురు వ్యక్తులు మాత్రమే రావాలన్నారు. నామినేషన్‌ వేసిన వెంటనే ప్రతిజ్ఞ చేసి రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో సంతకం చేయాలన్నారు. ఒక అభ్యర్ధి అత్యధికంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చునన్నారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు పక్కి దివాకర్‌ (వైసిపి), డాక్టర్‌ బి.గంగారావు (సిపిఎం), లక్ష్మీనారాయణ (బిజెపి), సుధాకర్‌ (కాంగ్రెస్‌), చంధ్రశేఖర్‌ (సిపిఐ), రమేష్‌ (బిఎస్‌పి), ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పాల్‌ కిరణ్‌ పాల్గొన్నారు.
అనకాపల్లి : స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్షాలతో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, డిఆర్‌ఒ వెంకటరమణ సమావేశమయ్యారు. ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలూ విధిగా పాటించాలన్నారు. జిల్లాలో 49 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనకాపల్లి డివిజన్‌లో 24, నర్సీపట్నం డివిజన్‌లో 20 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. సమావేశంలో సిపిఎం తరఫున ఆర్‌.శంకరరావు, రాజు, బిజెపి తరుఫున చదరం నాగేశ్వరరావు, బిఎస్‌పి నుంచి జి.చిన్నారావు, ఎస్‌వి.రావు పాల్గొన్నారు.