ఎన్నికల్లోపు విశాఖను రాజధానిగా ప్రకటించకుంటే మంత్రి అమర్నాథ్ రాజకీయ సన్యాసం చేస్తారా?
ఉత్తరాంధ్ర చర్చా వేదిక
ప్రజాశక్తి-అనకాపల్లి
రానున్న సార్వత్రిక ఎన్నికల లోపు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించకుంటే రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజకీయ సన్యాసం చేస్తారా? అని ఉత్తరాంధ్ర చర్చ వేదిక నాయకులు ప్రశ్నించారు. స్థానిక సంస్థ కార్యాలయంలో ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ విశాఖలోని దసపల్లా హోటల్లో ఈనెల 7న మాజీమంత్రి, ఉత్తరాంధ్ర చర్చ వేదిక వ్యవస్థాపకులు కొణతాల రామకృష్ణ విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర సమస్యలపైనా, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపైనా మాట్లాడారని తెలిపారు. ఇది జరిగిన గంటకే మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రామకృష్ణపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. డార్క్ రూమ్‌లో ఉన్న అమర్నాథను తీసుకొచ్చి వైసీపీలో చేర్చింది తమ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తుంచుకోవాలని హితవుపలికారు. నేడు మంత్రి అయ్యారంటే అది కొణతాల చలవేనన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ కొణతాల నిలబడితే మంత్రి అమర్నాథ్‌కు రోడ్డు మీద తిరిగే అవకాశం ఉండదని తెలుసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర చర్చ వేదిక అమర్నాథ్ మంత్రి కాక ముందు నుంచే ప్రజా సమస్యలపై పోరాడుతున్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు శిరసపల్లి ఆదిబాబు, మడగల శ్రీనివాసరావు, పీల నాగ శ్రీను, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాడి నాగరాజు, నూకాంబిక ఆలయ మాజీ చైర్మన్ పిళ్ల కొండయ్య నాయుడు, బుద్ధ రాజేష్, కర్రి సత్యనారాయణ, కే సందీప్ పాల్గొన్నారు.










