Nov 16,2022 00:07

జగన్మోహన్‌రెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి-సీతమ్మధార : ఎన్నికలు 16 నెలల్లో రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా సిద్ధం కావాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఉత్తర నియోజకవర్గం ముఖ్య నాయకులతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 16 నెలలంటే చాలా కాలం ఉందని అనుకోవద్దన్నారు. ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన పారదర్శకంగా సాగుతుందన్నారు. వివక్షకు, లంచాలకు ఆస్కారం లేకుండా పేదలకు పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతం పైచిలుకు హామీలను నెరవేర్చామన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయన్నారు. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే 80 వేల ఇళ్లకు పథకాలు అందాయని తెలిపారు. ప్రతిగడపకూ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి వారి ఆశీస్సులు పొందాలని చెప్పారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలను విన్నారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.