Nov 08,2023 23:19

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* జిల్లాలో ఇప్పటి వరకు 18,26,953 ఓటర్లు 

* రాజకీయ పార్టీల సమావేశంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ :
 ఎన్నికలకు ఇవిఎంలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎలక్ట్రోరల్స్‌పై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇవిఎంలు పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, మాక్‌ పోలింగ్‌ జరుగుతోందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 18,26,953 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. బిఎల్‌ఎలను టిడిపి, వైసిపిలు మాత్రమే నియమించారని, మిగిలిన పార్టీలూ సమయం ఉన్నందున బిఎల్‌ఎలను నియమించుకోవాలని సూచించారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామన్నారు. ఎలక్ట్రోరల్‌ రోల్‌ నమోదుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. అపీళ్లు , అభ్యంతరాలను దాఖలు చేయడానికి వ్యవధి డిసెంబరు 9 వరకు ఉందన్నారు. అపీళ్లు, అభ్యంతరాలను ఉపసంహరించుకునేందుకు డిసెంబరు 26 వరకు గడువు ఉంటుం దన్నారు. అలాగే ఫారం-6,7, తదితర ఫారాలపై ఉన్న అనుమానాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. తొలగింపులు ఉంటే ఫారం-7 తప్పని సరిగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుందన్నా రు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ తొలగించిన మృతుల వివరాలు ఇవ్వాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని మెట్టూరు పోలింగ్‌ కేంద్రాల సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా అక్కడ ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. టిడిపి నాయకులు పి.ఎం.జె.బాబు పొందూరు మండలంలో రేషనలైజేషన్‌లో పోలీంగ్‌ కేంద్రాన్ని మార్చడంపై అభ్యంతరం తెలిపారు. ఈ పోలింగ్‌ కేంద్రాన్ని మార్చడంతో అతి సమస్యాత్మక ప్రాంతంలో పోలింగ్‌ కేంద్రాన్ని నిర్వహించే వీలుందని ప్రస్తావించారు. అలాగే గార మండలం మొగదలపాడులో పోలింగ్‌ మార్పు చేయాలని కోరారు. అంతకుముందు వివిధ రాజకీయ పార్టీలతో గొడౌన్‌లోని ఇవిఎంలు కలెక్టర్‌ పరిశీలించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, సిపిఎం భవిరి కృష్ణమూర్తి, వైసిపి నాయకులు నుంచి రౌతు శంకరరావు, కాంగ్రెస్‌ నుంచి డి.గోవిందమల్లిబాబు, బిఎస్‌పి ఎల్‌.సోమేశ్వరరావు, సిసెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు, డిటి సనపల చక్రవర్తి పాల్గొన్నారు.