Nov 16,2023 21:48

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు

 కడప : రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు నోడల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలులో రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, సన్నద్ధతపై నోడల్‌ అధికారులతో కలెక్టర్‌ వి.విజరు రామరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు -2024 నిర్వహణలో భాగంగా ఎన్నికల సమయంలో జిల్లా స్థాయిలో వివిధ కార్యకలాపాలు నిర్వర్తించేందుకు గాను పలు శాఖలకు చెందిన అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి వారికి విధుల ను కేటాయించామని చెప్పారు. మ్యాన్‌ పవర్‌ నిర్వహణకు సంబంధించి సిపిఒ, డిఐఒలకు పర్యవేక్షణ బాధ్యతలను, ట్రైనింగ్‌ మేనేజ్మెంట్‌ (శిక్షణ నిర్వహణ)కు సంబంధించి పిబిసి-ఎంఆర్‌సి, ఎస్‌డిసి, ఎపిసి ఎస్‌ఎస్‌, ఏడి డిసేబుల్డ్‌ వెల్ఫేర్‌, డిఇఒ లకు విధులను కేేటాయించామని చెప్పారు. కంప్యూటరైజేషన్‌, సైబర్‌ సెక్యూరిటీస్‌, ఐటీ విభాగాల నిర్వహణకు అసిస్టెంట్‌ కలెక్టర్‌ అండర్‌ ట్రైనీకి, ఎస్‌విఇఇపి (స్వీప్‌) నిర్వహణకు గాను జిల్లా వ్యవసాయ అధికారి, ఎడి అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, స్టెప్‌ సిఇఒలకు బాధ్యతలను అప్పగించామని వివరించారు. కార్యక్రమంలో డ్వామా, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్లు యధుభూషణ్‌ రెడ్డి, ఆనంద్‌ నాయక్‌, జడ్‌పిసిఇఒ సుధాకర్‌రెడ్డి, సీపీఓ వెంకటరావు, పిఆర్‌ఎస్‌ఇ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఒ ప్రభాకర్‌ రెడ్డి, ఎన్‌ఐసి డిఐఒ విజరు కుమార్‌, డిటిసి మీరా ప్రసాద్‌, ఆర్‌టిసి ఆర్‌ఎం గోపాల్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులైన నోడల్‌ అధికారులు హాజరయ్యారు.
ఓటర్ల ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తున్నాం
ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024ను ఎలాంటి పెండింగ్‌ లేకుండా సిద్ధం చేస్తున్నామనిజిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. గురువారం రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరత్వాజ్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ వి. విజరు రామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విధి విధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికీ వరకు నూతనంగా 11823 మంది యువ ఓటర్లు ఎన్రోల్‌ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌, కలెక్టరేట్‌ హెచ్‌ సెక్షన్‌ సూపరిడెంట్‌ జ్ఞానేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.