* రానున్న నెల రోజులు కీలకం
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధుల్లో అధికారులు అలసత్వం వహించరాదని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ హెచ్చరించారు. రానున్న నెల రోజుల పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన పనుల్లో క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇఆర్‌ఒలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 57 వేల మంది ఓటర్లు రెండేసి చోట్ల ఓట్లను కలిగి ఉన్నారని తెలిపారు. వారికి వెంటనే ఫారం-ఎ నోటీసును అందజేసి వారికి ఎక్కడ ఓటు హక్కు కావాలో 15 రోజుల్లోగా నిర్ధారించి క్లయిమ్‌ను పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్ధారిత సమయంలోగా ఫారం-6 సహా అన్నిరకాల దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఫొటోలు, చిరునామా తప్పుగా ఉన్న క్లయిమ్‌ల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీ దరఖాస్తుల పరిశీలన బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా పూర్తి చేయాలన్నారు. ఇఆర్‌ఒ దగ్గర మండలం వారీగా ఆ సమాచారం ఉండాలని చెప్పారు. బూత్ లెవల్ ఏజెంట్ దగ్గర పెండన్సీ ఉన్నట్లయితే స్వయంగా తహశీల్దార్లు సందర్శించి క్లయిమ్‌లను పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు తదితరులున్నారు.