ఎన్నికల వేడి
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుంది. ఎన్నికల పర్వంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దాఖలైన నామినేషన్లను పరిశీలించిన అధికారులు ఆమోదించిన, తిరస్కరించిన నామినేషన్ల జాబితాను కూడా విడుదల చేశారు. దీంతో బరిలో నిలిచిన వారి పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా వాటిలో ఒకరి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. వైసిపి తరుపున నామినేషన్ దాఖలు చేసిన మధుసూదన్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆ స్థానానికి బరిలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 51 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్షంతో పాటు పలువురు అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పిడిఎఫ్, ప్రజా సంఘాలు బలపరచిన అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పిడిఎఫ్, పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరచిన కత్తి నరసింహారెడ్డి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అధికారపక్షం జిల్లాకు చేసిందేమీ లేకపోగా మరోవైపు భారాల పేరుతో సామాన్యుల నడ్డి విరిచింది. నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసింది. జిల్లాలోని ఏ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు చేపట్టలేదు. ప్రతిపక్షం కూడా గతంలో అధికారంలో ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి చేసిన చర్యలు నామ మాత్రమే. ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న పిడిఎఫ్ అభ్యర్థులు నిరుద్యోగుల, ఉద్యోగుల, యువకుల, సామాన్యుల సమస్యలపై ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా పిడిఎఫ్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా ప్రజా సమస్యలను మరింతగా మండలిలో వినిపించేందుకు అవకాశం దక్కనుంది.
కేంద్ర బడ్జెట్ పై నిరసనలు :
బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. ప్రత్యేక హౌదా విభజన హామీలలో వేటినీ ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు కేటాయించకపోగా కర్ణాటకలో నిర్మిస్తున్న అప్రభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.5300 కోట్లను కేటాయించారు. ఆ ప్రాజెక్టు వల్ల తుంగభద్ర దిగువకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. దీంతో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. కేంద్ర బడ్జెట్, బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
అవీ.. ఇవీ... అన్నీ..
ఎస్సై ఉద్యోగాల నియామకానికి ప్రిలిమ్స్ రాత పరీక్షను నిర్వహించారు. చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై టిడిపి నాయకులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు.
eevaram nandayala










