Jan 06,2023 23:57

మహిళతో మాట్లాడుతున్న ధర్మశ్రీ

ప్రజాశక్తి -రావికమతం: ఎన్నికల వాగ్దానాలను, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను నూటికి నూరు శాతం అమలు చేయడమే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ తెలిపారు. మండలంలో గుడివాడ పంచాయతీ మొట్టవానిపాలెం, గుడివాడ గ్రామాలలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సక్రమంగా అందుతున్నవీ లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మ శ్రీ మాట్లాడుతూ, అర్హులైన వారు ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండకూడదని ఆయన తెలిపారు. పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు, అతీతంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందే విధంగా చూడాలని మండల స్థాయి అధికారులకు, వాలంటీర్లకు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని పథకాలు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. గత రెండేళ్లు కరోనాతో ఆర్థికంగా రాష్ట్రం అనేక విధాలుగా సతమతమయినప్పటికీ ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేస్తున్నారన్నారు.ఈ పథకాలన్నీ చంద్రబాబు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఈ రోజు ఒకటే కదా అని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని, ఎన్నడూ ఉండదని ఆయన విమర్శించారు.ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, జగన్మోహన్‌ రెడ్డి హయాంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. గుడివాడ గ్రామ పంచాయతీకి ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.8 లక్షలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలరాజు, మండల ఆగ్రో అడ్వైజరీ కమిటీ చైర్మన్‌, మండల పార్టీ నాయకులు కంచిపాటి జగన్నాధరావు, సర్పంచ్‌ గుమ్మాల శంకర్రావు, ఎంపీటీసీ అప్పారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హులకు పింఛన్లు మంజూరు
ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేశామని పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు తెలిపారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపురం సచివాలయ పరిధిలోని గోకులపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నవరత్నాలలో భాగంగా ప్రతీ ఒక్కరికి సంక్షేమ పధకాలు వర్తింపచేస్తున్నామని, పెన్షన్లు, పక్కా ఇళ్ళు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు నూకి నాయుడు, బాబ్జి, శ్రీను, స్థానిక అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.