Sep 03,2023 00:03

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ఎన్నికల సామగ్రి అయిన ఈవీఎం, వివిప్యాట్స్ యంత్రాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీఎం, వివిప్యాట్స్ గోడౌన్‌ను ఆయన శనివారం పరిశీలించారు. హర్యానా నుంచి జిల్లాకు 4,620 వివిప్యాట్స్ యంత్రాలు, కర్ణాటక బెంగళూరు నుంచి 4,200 సియు యంత్రాలు జిల్లాకు అందడంపై కలెక్టర్ ఆరా తీశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎం, వివి పాట్స్ యంత్రాలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి అధికారులంతా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాకు వచ్చిన యంత్రాలను పటిష్టమైన భద్రతతో గోదాములో ఉంచాలన్నారు. ప్రతి యంత్రం కోడ్ నెంబరును ఆన్‌లైన్‌లో పరిశీలించి, గోదాములో భద్రపర్చాలని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో వాటిని గోదాముల్లో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జి రవీందర్, ఎన్నికల పర్యవేక్షకులు కృష్ణ కాంత్, తహసిల్దార్ సంధ్యారాణి పాల్గొన్నారు.